ఇన్నాళ్లు స్తబ్దుగా షూటింగ్లో గడిపేసిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. గ్రేటర్ ఎన్నికల సందర్బంగా మిత్ర పక్షం బీజేపీ కోసం బయటికొచ్చిన ఆయన పనిలో పనిగా ఏపీ రాజకీయాల్లో కూడ జోరుగా కలుగజేసుకుంటున్నారు. ఇటీవల సంభవంచిన తుఫాన్ కారణంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ రైతులను పరామర్శించే పని పెట్టుకున్నారు. బుధవారం రోజున కృష్ణ, గుంటూరు జిల్లాలోని రైతులను పరామర్శించి పంట నష్టం గురించి తెలుసుకుని రైతులకు తక్షణమే పరిహారం అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పనిలో పనిగా త్వరలో ఉప ఎన్నిక జరుగుతున్న తిరుపతిలో కూడ పర్యటించారు. ఈ పర్యటనలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే పాత గాయాలను నెమరువేసుకున్నారు.
అయితే ఈ గాయాలు తన అన్న చిరంజీవికి తగిలిన రాజకీయ గాయాలు కావడం విశేషం. చిరు ప్రజారాజ్యం పెట్టి చివరికి కాంగ్రెస్ పార్టీలో దాన్ని విలీనం చేసి వైఫల్యాన్ని మూటగట్టుకున్న వైనం అందరికీ తెలుసు. చిరు అంటే ప్రాణం పెట్టే అభిమానులు సైతం చిరు చేసిన పనికి తీవ్రంగా నొచ్చుకున్నారు. ఇప్పటికీ ఆ బాధలోనే ఉన్నవారు చాలామందే ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రజారాజ్యం పార్టీ అధ్యాయం చిరంజీవి జీవితంలో ఎప్పటికీ మానిపోలేని ఒక గాయం లాంటిది. ఆ గాయం చేసుకోవడంలో ఆయన తప్పిదం కూడ ఉంది. సహనం, ఓర్పు ఉన్న చిరు రాజకీయాల్లో మాత్రం వాటిని చూపలేకపోయారు. ఓటమి భారంతో, ఇక్కడ ఇమడలేమన్న భావనతో పార్టీని మూసేశారు. అప్పుడు గనుక ఆయన నిలబడి ఉండే మధ్యలో వచ్చిన రాజకీయ శున్యతలో ముఖ్యమంత్రి అయినా అయ్యుండేవారు.
మెగా అభిమానులు, రాజకీయ విశ్లేషకులు చాలామంది చెప్పే మాట ఇదే. పార్టీ విలీనం తర్వాత కొన్నాళ్ళకు చిరుకు కూడ ఆ విషయం అర్థమైంది. దాంతో మరింత బాధపడ్డారు. తప్పు మీద తప్పు చేసి బంగారం లాంటి రాజకీయ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నానని లోలోపల ఫీలవుతూనే ఉంటారు. అందుకే ఆ పీడకలను మర్చిపోవాలని చాలా ట్రై చేస్తుంటారు. డైవర్షన్ కోసం సినిమాలోకి వచ్చి వయసు మీదపడినా బిజీబిజీగా ఉంటున్నారు. అలా గాయాన్ని మర్చిపోయే ప్రయత్నంలో ఆయనుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడప్పుడు ఆ గాయాన్ని అన్నకు గుర్తుచేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు చిరు రాజకీయ ప్రయాణం గురించి ప్రస్తావించిన పవన్ పార్టీకి జరిగిన మోసాన్ని, తన అన్నను స్వార్థపరులు వాడుకున్న వైనాన్ని బహిరంగంగా చెబుతూనే ఉంటారు.
తాజగా తిరుపతిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో కూడ చిరు రాజకీయాల్లో ఉంది ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అన్నారు. దీంతో అభిమానులకు మరొక్కసారి చిరు ఫెయిల్యూర్ స్టోరీ కళ్ళ ముందు కదలాడింది. అభిమానులకే కాదు పవన్ మాటలు వింటే చిరుకు కూడ చివుక్కుమనే ఉంటుంది. లోలోపల ఇప్పుడు నా పాత గాయాలను రేపడం అవసరమా తమ్ముడూ అని అనుకున్నా అనుకునే ఉంటారు. అయినా పవన్ అన్న ఫెయిల్యూర్ స్టోరీ నుండి మౌనంగా పాఠాలు నేర్చుకోవాలి కానీ ఇలా పదే పదే దాన్ని గుర్తుచేస్తూ ఉంటే పుండు మీద కారం చల్లినట్టే ఉంటుంది మరి.