విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం సందర్భంగా వంద రూపాయల నాణాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాయిన్ కి సంబంధించి చాలా మందికి ఉన్న భ్రమలు, అనుమానాలూ ఏమిటి.. అసలు వాస్తవాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హాజరైనంతమాత్రాన్న.. ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించినంత మాత్రాన్న ఎన్టీఆర్ బొమ్మ ఉన్న ఈ కాయిన్… అధికారిక నాణెం కానేకాదు! అంటే… ఈ కాయిన్ పట్టుకుని కొట్టుకెళ్తే చెల్లుబాటు అయ్యేది కాదు! అంటే… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన నాణెం కాదు!
అవును… ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం వచ్చేసిందని, అది మార్కెట్ లో మారుతుందని ఎవరైనా అనుకుంటే పొరపాటే! కారణం… ఎందుకంటే.. ఈ నాణేలకు సమాజంలో నగదుగా చెలామణీ ఉండదు. అంటే… కేవలం జ్ఞాపికలుగా మాత్రమే ఆ నాణేలు ఉంటాయన్నమాట.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇలా ప్రత్యేక దినోత్సవాల్లో ప్రత్యేక నాణేలను ఎవరైనా విడుదల చేసుకోవచ్చు. అయితే కేంద్రప్రభుత్వం వాటిని మింట్ ద్వారా ముద్రించి అమ్మడానికి అనుమతించడం మాత్రం అవసరం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించిన హైదరాబాదు మింట్ వారు ఈ నాణానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా రాష్ట్రపతి విడుదల చేసిన ఎన్టీఆర్ కాయిన్ ను మంగళవారం నుంచి జనానికి అందుబాటులోకి తెస్తున్నట్లు మింట్ ఇవాళ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం పదివేల నాణేలు ముద్రిస్తున్నామని, డిమాండ్ ను బట్టి యాభైవేల నాణేలు ముద్రించగలమని అంటున్నారు.
ఆన్ లైన్ లో ఎన్టీఆర్ కాయిన్ తెప్పించుకోవాలనుకునే వారు మింట్ అధికారి వెబ్ సైట్ లో ఆర్డర్ చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ కాయిన్ కావాల్సిన వారు మింట్ వెబ్ సైట్ లోకి వెళ్లి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికి సంబందించిన అమౌంట్ ను ఆన్ లైన్ లోనే కానీ.. ఆఫ్ లైన్ లో కూడా చెల్లించొచ్చు!
ఇదే క్రమంలో… మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లి మింట్ సేల్ కౌంటర్లలో ఎన్టీఆర్ స్మారక కాయిన్ ను విక్రయిస్తారు. ప్రస్తుతానికి ఒక్కొక్కరికి ఒక్కో కాయిన్ మాత్రమే విక్రయించనున్నట్లు మింట్ అధికారులు తెలిపారు.
వెండి, ఇతర లోహాలు కలిపి తయారుచేసిన ఈ కాయిన్ ని మింట్ వారు సుమారు నాలుగువేల రూపాయలకు విక్రయిస్తున్నారు! ఎన్టీఆర్ అభిమానులు వీటిని కొని జాగ్రత్తగా దాచుకోవచ్చు తప్ప నగదుగా మాత్రం వాడుకోలేరు!