ఎన్టీఆర్ ఫ్యామిలీ… కొడాలి లాంటి వారిని మిస్ చేసుకోవద్దు!

మహానాడు ముగిసిన అనంతరం మైకుల ముందుకు వచ్చారు వైసీపీ మాజీమంత్రి కొడాలి నాని. వచ్చీ రాగానే చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడిని వాయించి వదిలిపెట్టారు! ఏ టాపిక్ కి ఆ టాపిక్ ఎత్తుకుంటూ.. డిటైల్డ్ గా వివరిస్తూ.. అందరికీ అర్ధమయ్యేలా వాయించారు. అనంతరం టీడీపీ విడుదల చేసిన తొలి విడత మేనిఫెస్టోపై స్పందించారు కొడాలి నాని. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫ్యామిలీపై ఆయనకున్న అభిమానాన్ని పరోక్షంగా మరోసారి బయటపెట్టుకున్నారు.

చంద్రబాబు పేరు చెబితే అంతెత్తున లేచిపడిపోతూ… సీనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే ఎమోషన్ అయిపోతూ… జూనియర్ ఎన్టీఆర్ పేరుచెబితే, ఆయనకోసం అడ్డంగా నిలబడిపోతా అన్నట్లు ప్రవర్తించే కొడాలి… మరోసారి అన్నగారి కుటుంబ సభ్యులపై తన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. బాలకృష్ణ అంటే బాబుతో తిరుగుతాడనే కోపమే తప్ప… తనకు వ్యతిగతంగా ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు!

ఎన్టీఆర్ వందవ పుట్టినరోజు సందర్భంగా మహానాడులో ప్రత్యేకంగా ఏమీ చేయలేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు తన భజన చేయించుకున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మహానాడుతో పాటు యావత్ టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటూ, ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న ఒక విషయంపై కొడాలి తనదైన స్టైల్లో ప్రశ్నించారు.

“అసలు పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు? లోకేష్ పాదయాత్రకు వెళ్లి చనిపోయిన తారకరత్న ఫోటో ఎందుకు పెట్టలేదు?” అని ఘాటుగా ప్రశ్నించారు కొడాలి నాని. చంద్రబాబు ఫోటో, అతని వారసుడు లోకేష్ ఫోటో పెట్టుకున్నారే తప్ప… పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వారసుల పేర్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

“జూనియర్ ఎన్టీఆర్ అయితే మీతో కలిసి నడవడం లేదు.. కానీ బాలయ్య మాత్రం అమాయకంగా ఇంకా మిమ్మల్నే నమ్ముతూ మీతో నడుస్తున్నాడుగా.. పైగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడుగా.. ఎన్టీఆర్ బ్లడ్ కదా.. మరి ఆయన ఫోటో ఎందుకు పెట్టలేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ ఫోటో ఎందుకు పెట్టారు” అంటూ తనదైన పదజాలంతో సూటిగా ఘాటుగా ప్రశ్నించారు కొడాలి నాని.

దీంతో… ఆన్ లైన్ వేదికగా నందమూరి అభిమానులు, కొడాలి నానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నందమూరి కుటుంబానికి సరైన అభిమాని అని కొనియాడుతున్నారు. ఇప్పటికైనా అసలు సిసలు అన్నగారి అభిమానులు కొడాలి వ్యాఖ్యలను అర్ధం చేసుకోవాలని.. చంద్రబాబు వంకర బుద్దిని గ్రహించాలని ఆన్ లైన్ వేదికగా అభ్యర్థిస్తున్నారు!