BJP: ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

AP- Telanagan BJP

AP- Telanagan BJP: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల పరిశీలకులు, బీజేపీ రాజ్యసభసభ్యులు లక్ష్మణ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు స్క్రూటినీ చేస్తారు. అనంతరం మంగళవారం ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక అనంతరం అదే రోజు కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి, పార్టీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి శోభా కరంద్లాజే హైదరాబాద్‌ రానున్నారు.

బీజేపీ అధ్యక్ష రేసులో ఎంపీలు ధర్మపురి అరవింద్‌, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. మహిళల కోటాలో ఎంపీ డీకే అరుణ కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీ నినాదం అందుకోవడంతో బీజేపీ పెద్దలు బీసీ నేతలకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఇదే జరిగితే మాత్రం బీసీ వర్గానికి చెందిన ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ లలో ఒక్కరికి అవకాశం దక్కనుంది.

మరోవైపు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు కూడా రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సోమవారం నామినేషన్లు స్వీకరించి.. మంగళవారం ఎన్నికల జరపనున్నారు. అధ్యక్ష రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సీనియర్ నేతలు విష్ణువర్థన్ రెడ్డి ఉన్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులుగా ఎవరు నియమితులు కానున్నారో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.