జగన్ పర్యటన.. అధికారుల ఓవరాక్షన్ మామూలుగా లేదుగా!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో నిన్న పర్యటించిన సంగతి తెలిసిందే. జగన్ తిరుపతి పర్యటన వల్ల సామాన్య ప్రజలు, తిరుమలకు దర్శనానికి వచ్చిన భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. అధికారుల ఓవరాక్షన్ ప్రజల ఇబ్బందులకు కారణమని తెలుస్తోంది. సీఎం తిరుపతికి వస్తున్నారని పోలీసులు ఆంక్షలను విధించడంతో పాటు తిరుపతిలోని కొన్నిచోట్ల రాకపోకలను నిలిపివేశారు.

పలు చోట్ల నిన్న ఉదయం నుంచి దుకాణాలను మూసేయడంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. సీఎం పర్యటన వల్ల సామాన్యులకు దర్శనాలను నిలిపివేశారని సమాచారం అందుతోంది. చివరకు కూరగాయల మార్కెట్ గేట్లను సైతం పోలీసులు మూసేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం కాన్వాయ్ అలిపిరికి బయలుదేరే వరకు సామాన్య ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

సామాన్య ప్రజలలో చాలామంది జగన్ కు అర్జీలు ఇవ్వాలని అనుకున్నారు. అయితే జగన్ కు అర్జీలు ఇవ్వాలని అనుకున్న వాళ్లకు సైతం నిరాశ ఎదురైంది. ప్రజలు ఇచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టర్ తీసుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వెల్లడించారు. అయితే జగన్ కు తమ సమస్యలను చెప్పుకుని ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

అధికారుల వల్ల జగన్ కు, ప్రజలకు మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్నికలకు 18 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో జగన్ ప్రజలకు మరింత దగ్గరయ్యే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. జగన్ కు తెలియకుండా అధికారులు ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.