‘వారాహి’ యాత్ర అటకెక్కినట్లేనట.!

మొన్నామధ్యన ‘షో’ చేశారు ‘వారాహి’ వాహనంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ వాహనాన్ని సినిమా షూటింగుల్లో ‘క్యారవాన్’లా వాడుతున్నారనే కామెంట్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ‘అబ్బే, ఆ అవకాశమే లేదు’ అని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇంతకీ, ‘వారాహి’ ఎక్కడ.? అసలు ‘వారాహి’ ఏం చేస్తోంది.? వస్తోంది.. త్వరలో వచ్చేస్తుంది.. అని జనసైనికులైతే నమ్ముతున్నారు. ఈ నెల 14న మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనున్న దరిమిలా, ఆ సభ వద్దకు జనసేనాని ‘వారాహి’ వాహనంలోనే వస్తారని జనసేన పార్టీ చెబుతున్న సంగతి తెలిసిందే.

అంటే, ఇంకో రోజు ‘వారాహి’తో పవన్ కళ్యాణ్ హడావిడి చేస్తారన్నమాట. అంతేనా.? జనంలోకి ‘వారాహి’తో వెళ్ళే అవకాశం లేదా.? రాష్ట్ర వ్యాప్త పర్యటన అన్న ఆలోచనే జనసేనాని పక్కన పెట్టేశారా.? ఈ విషయమై రకరకాల ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ‘వారాహి’ యాత్ర విషయమై జనసేన అధినేత త్వరలో నిర్ణయం తీసుకుంటారని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు.

ఈ మధ్య తరచూ మీడియా ముందుకు వస్తున్న నాదెండ్ల మనోహర్, రాజకీయ పొత్తుల గురించి మాత్రం పెదవి విప్పడంలేదు. ‘మార్చి 14న అన్ని విషయాలపైనా పవన్ కళ్యాణ్ స్పష్టతనిస్తారని ఆశిస్తున్నాం..’ అని మాత్రమే చెబుతున్నారు నాదెండ్ల మనోహర్.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారాహి యాత్ర ఇప్పట్లో వుండకపోవచ్చని తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ‘వారాహి’ వాహనాన్ని జనసేనాని ఉపయోగిస్తారేమోగానీ.. పాదయాత్ర లేదా వారాహి యాత్ర లాంటివి ఈలోగా వుండకపోవచ్చన్నది ఆయా వర్గాల నుంచి వస్తున్న అనధికారిక అప్డేట్.