మళ్ళీ బీహార్ సీఎంగా నితీష్ కుమార్.! ఇదేదో ‘పిల్లలాట’లా వుందే.!

బీహార్ ముఖ్యమంత్రిగా ఇంకోసారి నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన కాస్సేపటి క్రితం పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. బీజేపీ కూటమి నుంచి బయట పడి, ఆర్జేడీ కూటమిలోకి దూకినా.. నితీష్ కుమార్ సీఎం పదవి మాత్రం గల్లంతు కాలేదు. కాకపోతే, పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారంతే.!

బీహార్ రాజకీయమే అంత.! అంత తేలిగ్గా అర్థమయ్యే రాజకీయం కాదు. నితీష్ కుమార్ నేతృత్వంలో బీహార్ రాష్ట్రం కొంత మేర పురోగతి సాధించింది.. అంతకు ముందు పరిస్థితులతో పోల్చితే. మద్యనిషేధం సహా చారిత్రక నిర్ణయాల్ని నితీష్ కుమార్ తీసుకోవడం తెలిసిన విషయమే.

అంతే కాదు, ఒకప్పుడు బీహార్ రాష్ట్రమంటే రక్తసిక్తం, ముఠాతగాదాలు.. అబ్బో, ఆ మాఫియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటికీ బీహార్ అంటే ఆ పేరు అలానే వున్నా, గతంతో పోల్చితే కాస్త బెటర్. ఇప్పుడు బీహార్‌లో కూడా అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

గతంలో కాంగ్రెస్, ఆర్జేడీలతో జతకట్టిన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, ఆ తర్వాత ఆ కూటమి నుంచి బయటకు వచ్చి, బీజేపీ పంచన చేరిన విషయం విదితమే. ఓ సారి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. మళ్ళీ ఇప్పుడు ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్.

బీహార్‌లో ఎన్ని రాజకీయ పార్టీలున్నా.. ఏ కూటమి అధికారంలో వున్నా నితీష్ కుమార్ మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్లు తయారైంది పరిస్థితి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వింత పరిస్థితిని చూడలేం.