15, 15, 15, 15… పిల్లలు మ్యూట్ – తల్లి హైలైట్!?

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటినీ అమలుచేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పెంచిన పెన్షన్స్ ని పంపిణీ చేసింది. మెగా డీఎస్సీపై కసరత్తులు మొదలుపెట్టింది. అన్న క్యాంటీన్లనూ ఆచరణలో పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఆ సంగతి అలా ఉంటే… తాజాగా “ఉచిత ఇసుక” పథకం ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. ఆ పథకంపై ఎన్ని విమర్శలు రావాలో, ఎన్ని ట్రోల్స్ జరగాలో అన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. .బాబు మార్కు టెరమ్స్ అండ్ కండిషన్స్ అనుభవం లేని అమాయకులు కుయ్యో మొర్రో అంటున్నారని తెలుస్తోంది.

ఇప్పుడు “అమ్మ ఒడి” పేరు మార్చి పెట్టిన “తల్లికి వందనం” కార్యక్రమం వంతొచ్చింది. ఇందులో భాగంగా… ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులకు “ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.15 వేల్లు” చొప్పున ఆర్థిక సాయం అందించాల్సి ఉంది!

ఈ సమయంలో చంద్రబాబు తన మార్కు కండిషన్స్ తో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా సదరు విద్యార్థి ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాఠశాలల్లో మాత్రమే చదవాలని తెలిపింది. ఇదే సమయంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారే అర్హులని చెప్పింది! ఇక విద్యార్థికి 75 శాతం అటెండెన్స్ ఉంటేనే ఈ పథకానికి అర్హత అని నొక్కి చెప్పింది.

ఈ సమయంలో పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఉదాహరణకు 75శాతం అటెండెన్స్ కంపల్సరీ అనేది మంచి ఆలోచనే అయినప్పటికీ… అటెండెన్స్ ని ప్రామాణికంగా తీసుకుంటే ఫైనల్ పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ ఏడాదికి సంబంధించి “తల్లికి వందనం” డబ్బులు ఇస్తారా అనేది ఒక సందేహం పలువురు తల్లులు వ్యక్త పరుస్తున్నారు.

ఇదే సమయంలో కేవలం ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే అంటే… ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే “అమ్మ ఒడి”కి అలవాటు పడిన పలువురు తల్లితండ్రులు “తల్లికి వందనం” డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో ఇప్పటికే తమ పిల్లలను కాన్వెంట్ లో జాయిన్ చేసేసీ ఎదురుచూస్తున్న పరిస్థితి!

దీంతో… చిన్న చిన్న కాన్వెంట్లకు పంపుకుంటూ తమ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని ఆలోచించే తల్లులకు బాబు తనదైన షాక్ ఇచ్చినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇక దారిద్రరేఖ దిగువన అంటే… తెల్లరేషన్ కార్డు ఉంటే సరిపోతుందా.. లేక, ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు కూడా కౌంట్ చేసే కండిషన్ ఏమైనా ఉంటుందా అనే సందేహాలూ వ్యక్తపరుస్తున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో ప్రధానంగా… ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొల్లులో ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు ప్రచారం చేస్తూ ఓ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మహిళతో… ఆమె పక్కనే ఉన్న నలుగురు పిల్లలనూ చూపిస్తూ… ఆమెకు 15, ఆమెకు 15, ఆమెకు 15, ఆమెకు 15 మొత్తం కలిపి 60 వేలు వస్తాయి.. దానికి సంబంధించి బాండ్ కూడా ఇచ్చేశాం అని చెప్పారు!

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే… ఈ విషయంలో తల్లులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి రూ.15,000 మాత్రమే ఇస్తారా.. లేకపోతే చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో చెప్పినట్లు, నిమ్మల రామానాయుడు ఇంటింటికీ వెళ్లి బాండ్ ఇచ్చినాము అని చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తారా అనే విషయంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.