నిమ్మగడ్డ లేఖ అక్కడ తయారవ్వలేదా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోమ్ శాఖకు రాసినట్టు చెపుతున్న లేఖ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో తయారవవలేదని రాష్ట్ర ఫోరెన్సిక్ అధికారులు తేల్చేశారు. ఈ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన సిఐడి అధికారులు సదరు లేఖ ప్రతులను, కార్యాలయంలో వినియోగించినట్టు చెపుతున్న లాప్ టాప్ మరియు డెస్క్ టాప్ కంప్యూటర్లు, ప్రింటర్ తదితర వస్తువులను ఫోరెన్సిక్ అధికారులకు అందజేశారు. ఫోరెన్సిక్ అధికారులు ఈ మేరకు అన్ని వస్తువులను, లేఖను పరిశీలించి నివేదిక తయారు చేశారు. ఈ నివేదికలో ప్రధానంగా సదరు లేఖ ఎన్నికల కార్యాలయంలో తయారు కాలేదని పేర్కొన్నట్టు మీడియాలో వచ్చింది. 
 
కాగా ఈ లేఖను తానే రాశానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో ప్రకటించారు. ఎన్నికల కమిషనర్ హోదాలో, ఒక ఐఏఎస్ అధికారిగా ఈ లేఖను కేంద్ర హోమ్ శాఖకు తానే రాశానని ఇందులో ఇతరులెవరూ కల్పించుకోవాల్సిన లేదా ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా నిమ్మగడ్డ తన ప్రకటనలో తెలియజేశారు. ఈ లేఖ వ్యవహారం బయటపడిన రోజు లేఖ తానే రాశానని చెప్పేందుకు నిమ్మగడ్డ అంగీకరించలేదు. ఈ లేఖను ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తన కార్యాలయంలో తయారు చేసిందని, అదే లేఖను నిమ్మగడ్డ తన అధికారిక ఈమెయిలు ద్వారా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు పంపించారని ఆరోపించింది. అయితే అప్పట్లో ఈ ఆరోపణలను నిమ్మగడ్డ ఖండించలేదు. తనను ఎన్నికల కమిషనర్ పదవినుండి తొలగించిన తర్వాత, అదికూడా విజయసాయి రెడ్డి పిర్యాదు చేసిన తర్వాత మాత్రమే నిమ్మగడ్డ ఈ లేఖపై ఒక ప్రకటన ద్వారా స్పందించారు. 
 
ఫోరెన్సిక్ అధికారుల నివేదికకు ముందు సిఐడి అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కొందరు అధికారులను విచారించారు. కమిషనర్ కార్యదర్శి మూర్తి ఈ విచారణలో భాగంగా ఈ లేఖ గురించి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఇప్పుడు సిఐడి అధికారులు నిర్ధారణకు వచ్చారు. లేఖ నిమ్మగడ్డ చెపుతుంటే తాను రాసుకున్నని, ఆ తర్వాత దానిని తన కంప్యుటర్లో టైపు చేసి, ప్రింట్ తీసి నిమ్మగడ్డకు ఇచ్చానని మూర్తి చెప్పారు. ఆ లేఖపై నిమ్మగడ్డ సంతకం చేసిన తర్వాత దానిని స్కాన్ చేసి ఒక పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసి నిమ్మగడ్డకు అందజేశానని, ఆ తర్వాత స్కాన్ చేసిన లేఖను నిమ్మగడ్డ మొబైల్ కు పంపానని సిఐడి అధికారులకు తెలిపాడు. ఈ తతంగం అంతా ముగిసిన తర్వాత లేఖకు సంబంధించిన ఆధారాలను తాను తొలగించానని, లాప్ టాప్ ను ఫార్మాట్ చేశాననీ, పెన్ డ్రైవ్ ను ధ్వంసం చేశానని అధికారులకు తెలిపాడు. 
 
అయితే ఫోరెన్సిక్ అధికారుల పరిశోధనలో మూర్తి చెప్పినవన్నీ తప్పుడు సమాచారమని, ఈ లేఖ ఎన్నికల కమిషనర్ కార్యాలయంలోనే తయారు కాలేదని తేల్చి చెప్పడంతో అధికారులు మరోసారి మూర్తిని ప్రశ్నించేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా ఈ లేఖ ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో తయారు కానీ పక్షంలో ఎక్కడ తయారయింది, ఎవరు తయారు చేశారు, నిమ్మగడ్డకు ఎవరు పంపించారు వంటి అంశాలను సిఐడి అధికారులు తేల్చాల్సి ఉంది. 
 
కాగా, ఈ లేఖలో నిమ్మగడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఒక అధికారి ముఖ్యమంత్రిపై ఇటువంటి ఆరోపణలు చేయడం వ్యక్తిగతంగా సాధ్యం కాదు. ఎవరి ప్రోద్భలంతోనో నిమ్మగడ్డ ముఖ్యమంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారో కేసును పరిశోధిస్తున్న అధికారులు తేల్చాల్సి ఉంది. 
 
ఇదిలా ఉండగా, నిమ్మగడ్డ తొలగింపు, కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం తదితర విషయాలపై రాష్ట్ర హై కోర్టు విచారణ చివరి దశకు చేరుతోంది. శుక్రవారం నాటికి వాద, ప్రతివాదనలు ముగిసే అవకాశం ఉంది. తీర్పు అదే రోజు వస్తుందా లేక వాయిదా పడుతుందా అన్నది చూడాలి. 
 
మరోవైపు నిమ్మగడ్డ కేంద్రానికి రాసినట్టు చెపుతున్న లేఖలో ముఖ్యమంత్రిపై ఆయన వాడిన భాష పట్ల కూడా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో గట్టిగానే ఉన్నారని, ఈ లేఖ గుట్టు రట్టు చేయడంతో పాటు నిమ్మగడ్డపై అధికారికంగా మరియు వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేసేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. లేఖ నిమ్మగడ్డ కార్యాలయంలో తయారుకాలేదని ఫోరెన్సిక్ అధికారులు, సిఐడి అధికారులు ఋజువు చేస్తే చర్యలు కఠినంగానే ఉండబోతున్నాయి అని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.