రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబునాయుడు సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ‘మీ భవిష్యత్తు-మా బాధ్యత’ అనే నినాదంతో ఓటర్లను ఆకర్షించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తులే వేశారు. పోయిన ఎన్నికల్లో అధికారం అప్పగించిన తర్వాత ఇటువంటి నినాదాలు చాలానే అప్పట్లో ప్రజల్లోకి వదిలారు. ‘జాబు కావాలంటే బాబు రావాలి’ నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, డ్వాక్ర రుణాల మాఫీ లాంటివి వాటితో జనాలను ఊదరగొట్టారు. మొత్తానికి ఏదో అదృష్టం కలిసొచ్చి అధికారంలో కూర్చున్నారు.
కానీ అధికారంలోకి రాగానే ఏం చేశారో అందరూ చూసిందే. రుణమాఫీలను గాలికొదిలేశారు. నిరుద్యోగ భృతి అంటే ఏమిటంటూ ప్రశ్నించారు. చివరకు రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులు, యువత నుండి దెబ్బ తప్పదన్న భయంతో ఆరు మాసాల క్రితమే అరాకొరగా నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నామని అనిపించుకున్నారు. రుణమాఫీలు సంపూర్ణంగా అమలు చేయలేదు.
ఇలా ఏ హమీని చూసినా అరాకొర అమలుతోనే నెట్టుకొచ్చేశారు. అలాంటిది రెండోసారి అధికారంలోకి వస్తే మీ బాధ్యత మా బాధ్యత అంటూ జనాలను బురిడీ కొట్టించేందుకు రెడీ అయిపోయారు. నిజానికి రాబోయే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనే పరిస్ధితుల్లో పార్టీ లేదన్నది వాస్తవం. చాలా జిల్లాల్లో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంటోంది. అభ్యర్ధుల ఎంపికలో లీకులకే పార్టీలో అంతటి గొడవలు జరుగుతున్నాయి. ఇక అధికారికంగా ప్రకటిస్తే పరిస్ధితి ఎలాగుంటుందో ? ఒకవైపు జనాల్లో వ్యతిరేకత మరోవైపు పార్టీలో పెరిగిపోతున్న అసమ్మతి. గందరగోళం మధ్యే చంద్రబాబు ఎన్నికలను ఎదుర్కోవాల్సొస్తోంది. మరి ఏ విధంగా వైసిపిని ఎదుర్కొంటారో చూడాల్సిందే.