తెలంగాణ స్పీకరెవరు? పోచారం శ్రీనివాస రెడ్డేనా?

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఎవరిని నియమిస్తున్నారనే చర్చ పార్టీ నేతల్లో , శాసన సభ్యుల్లో మొదలయింది. సాధారణంగా స్పీకర్ పదవిని ఎవరూ  పెద్దగా లైక్ చేయరు. మంత్రి పదవే లాభసాటి. హోదా తప్ప స్పీకర్ కు ప్రభుత్వంలో రోల్ ఏమీ ఉండదు. అందువల్ల చాలా మటుకు ఎవరూ స్పీకర్ పదవిని ఇష్టపడరు. ఒక వేళ స్పీకర్ పదవి దొరికినా మంత్రి పదవి మీద కన్నేసి ఉంటారు.  దానికి తోడు స్పీకర్ పదవికి చుట్టూ బోలెడు అపోహలున్నాయి. స్పీకర్ గా పని చేసిన వాళ్లు గెలవరని, అది అందరికి అచ్చిరాదని, స్పీకర్ సీట్లో కూర్చుంటే సమస్యలొస్తాయని అనుమానాలున్నాయి. ప్రతిపనికి ప్రొటోకోల్ అడొస్తుంది. తెలంగాణలో కూడా ఈ భయాలున్నాయి. ముఖ్యంగా  స్పీకర్ పదవి చేపట్టిన వాళ్లు గెలవరనే నమ్మకం బాగా బలంగా ఉంది. ముఖ్యమంత్రికి  ముహుర్తాలు, యాగాలు, శకునాల మీద విశ్వాసం ఉండటం గమనించిన  శాసన సభ్యులు, ఈ శకునాలను, అపశకునాలను బలంగా నమ్ముతున్నారు. 

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  స్పీకర్ గా పనిచేసిన శ్రీపాదరావు, సురేష్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ వోడిపోయిన ఉదాహరణలు చూపిస్తున్నారు. ఇపుడు తాజాగా తెలంగాణ మొదటి స్పీకర్  మధుసూదనాచారి వోడిపోవడంతో ఈ భయం  ఎక్కువయింది. ఈ పోస్టు ఎవరికీ అచ్చిరాదనే అపోహ ఎమ్మెల్యేలనుపీడిస్తూ ఉంది. దీనితో తదుపరి స్పీకర్ ఎవరనే పశ్న ఉదయిస్తున్నది. చాలా మంది ఈ భారం తమ మీదెక్కడ పడుతుందో నని ఆందోళన తో కూడా ఉన్నారు. ఒక వేళ ముఖ్యమంత్రి  స్పీకర్ పదవి ఆఫర్ చేస్తే ఎలా? ే ఏపదవి రానపుడు ఏదో ఒక పదవని అనుకోవాలా , లేక అచ్చిరాని పదవి తీసుకుని తర్వాత వోడిపోవడమా?  దీనికంటే ఎమ్మెల్యే గా ఉంటడటమే నయమని  చాలా మంది భావిస్తున్నారని మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.

ఇప్పటి  టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలలో సీనియర్ మోస్టు నాయకుడు పోచారం శ్రీనివాస రెడ్డి కాబట్టి ఆయనను స్పీకర్ ను చేసే అవకాశం లేకపోలేదని కొందరంటున్నారు. శ్రీనివాస రెడ్డి వంటి సీనియర్ నాయకుడు ఆ పోస్టు కు వన్నె తెస్తారని, ముఖ్యమంత్రితో మంచి సంబంధాలున్నందున స్పీకర్ కార్యాలయం, సిఎంఒ మధ్య మంచి అవగాహన ఉంటుందని  వారు చెబుతున్నారు. దానికితోడు పోచారం శ్రీనివాస రెడ్డి చాలా అనుభవజ్ఞుడు. బలమయిన రాజకీయ,కుల నేపథ్యం లేని మధుసూదనచారి స్పీకర్ పదవికి పెద్దగా కాంట్రిబ్యూట్ చేసిందేమీ లేదనే అభిప్రాయం పార్టీలో ఉందట. అందువల్ల పోచారం వంటి సీనియర్ నేత  సభను హుందాగా నడిపిస్తాడని, ఆయనే యోగ్యుడని  చెబుతున్నారు. పోచారం  వయసు 69  సంవత్సరాలు. వచ్చే ఫిబ్రవరిలో ఆయనకు 70 సంవత్సరాలు పడతాయి. రాజకీయంగా చాలా అనుభవం ఉంది. 

మొదట్లో కాంగ్రెస్ లో ఉన్నా 1984 లో ఆయన టిడిపిలో చేరారు. 2011 దాకా ఆ పార్టీలోనే ఉన్నారు. రెండు సార్లు  మంత్రి అయ్యారు. తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్నపుడు ఆయన టిఆర్ ఎస్ లోచేరారు. ఎపుడూ బాన్స్ వాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. ఎపుడు గెలిచినా మంచి మెజారిటీ తో గెలుస్తారు. మంత్రి అవుతారు. 2014 లో టిఆర్ ఎస్ అభ్యర్థిగా ఆయన గెల్చి తెలంగాణ మొదటి వ్యవసాయ మంత్రి అయ్యారు. రైతు బిడ్డగా ఆయన ఆ శాఖను చాలా సమర్థవంతంగా నడిపారు. రాజకీయ వివాదాలతో కాకుండా వ్యవసాయ సంబంధం  కార్యక్రమాలతో ఎపుడూ వార్తల్లో ఉండిన మంత్రి పోచారం. ట్రాక్టర్ నడిపి, మోటార్ బైక్ నడిపి, ఎద్దుల బండి రైతుల మధ్య రైతుగా కనిపించే  పోచారం  అసెంబ్లీ లో కనిపించ పదహారాణాల తెలుగు వాడు. సౌమ్యుడు. పరుష పదజాల ప్రయోగం ఆయనకు తెలియదు.

అందువల్ల వల్ల పోచారం శ్రీనివాస రెడ్డిని స్పీకర్ గా నియమిస్తారని ఒక సెక్షన్ పార్టీ ఎమ్మెల్యేలలో బలంగా ఉంది. మరి ముఖ్యమంత్రి మనసులో ఏముందో తెలియదు.