రాజకీయాలే మానేస్తా..కోట్ల కొత్త నాటకమా ?

అవును కర్నూలు జిల్లాలో మొన్నటి వరకూ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న కోట్ట సూర్యప్రకాశరెడ్డి రాజకీయాలే మానేస్తానంటున్నారు. ఏ పార్టీలో చేరొద్దు ఇంట్లో కూర్చోమని తన మద్దతుదారులు గనుక చెబితే వెంటనే రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చుంటానంటూ కోట్ల చెప్పటంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబునాయుడును అమరావతిలో కుటుంబంతో సహా కలిసి విందు చేశారు. కర్నూలు ఎంపితో పాటు ఆలూరు, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలను చంద్రబాబుతో భేటీ సందర్భంగా కోట్ల అడిగినట్లు టిడిపినే లీకులిచ్చింది. కోట్ల అడిగారు కానీ చంద్రబాబు ఏమీ చెప్పలేదని, జిల్లాలోని రెవిన్యూమంత్రి, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తితో మాట్లాడి చెబుతానని బదులిచ్చినట్లు టిడిపినే మీడియాకు చెప్పింది.

అంటే అర్ధమేంటి ? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోట్ల కుటుంబం టిడిపిలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లే కదా ? కోట్ల అడిగిన సీట్లకు చంద్రబాబు ఒప్పేసుకుంటే వెంటనే కోట్ల కుటుంబం పచ్చకండువా  కప్పుకోవటం ఖాయమే. నిజానికి కోట్లతో చంద్రబాబు భేటీ అవుతున్న విషయం కెఇకి ఏమాత్రం సమాచారం లేదు. ఆ విషయాన్ని స్వయంగా కెఇనే ఓ పత్రికా రిలీజ్ రూపంలో చెప్పారు. ఒకవైపు చంద్రబాబు, కోట్ల భేటీ జరుగుతున్న సమయంలోనే  మీడియా రిలీజ్ ఇచ్చారంటేనే కోట్ల చేరికపై కెఇ ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్ధమైపోతోంది.

ఇంతకీ కెఇ అసంతృప్తికి కారణం ఏమిటి ? ఏమిటంటే, కోట్ల అడుగుతున్న డోన్ సీటులో పోయిన ఎన్నికల్లో కెఇ కృష్ణమూర్తి తమ్ముడు కెఇ ప్రభాకర్ ఓడిపోయారు. రేపటి ఎన్నికల్లో మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారు. ఇటువంటి సమయంలో హఠాత్తుగా కోట్ల వచ్చి తనకు టిక్కెట్టు కావాలంటే కెఇ సోదరులకు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. అదే సమయంలో కెఇ సోదరుల సహకారం లేకుండా కోట్ల కుటుంబం గెలిచే ముచ్చటే లేదు.

మామూలుగానే చంద్రబాబు పాలనపై విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది.  ఈ సమయంలో కోట్లను చేర్చుకుంటే కర్నూలు ఎంపి స్ధానంతో పాటు డోన్, ఆలూరు అసెంబ్లీ స్ధానాల్లో నేతలు డిస్ట్రబ్ అవుతారు. అంతమందిని సర్దుబాటు చేసి కోట్ల కుటుంబాన్ని టిడిపిలో చేర్చుకోవటమంటే టిడిపికి ఏమిటి లాభం ? అన్న విషయం మీదే చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అందుకనే భేటీ జరిగి రెండు రోజులైనా చంద్రబాబు ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదట. కోట్లను గనుక పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు అనుకుంటే అందుకు కెఇతో మాట్లాడాలని చెప్పటం ఉత్తదే. కాబట్టి అందుకనే కోట్ల కూడా ముందుజాగ్రత్త పడుతున్నట్లున్నారు.