చంద్రబాబుకు కొత్త టెన్షనేంటి ?

ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎంఎల్ఏలుగా ఇంత కాలం బ్రహ్మాండంగా అధికారాన్ని అనుభవించిన వారు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీని వదిలిపెట్టేయటం ఆశ్చర్యంగా ఉంది. తాజాగా చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ విషయంలో చంద్రబాబు తల్లకిందలవుతున్నారు. ఎంఎల్ఏలు పార్టీని వదిలిపెట్టేయాలని అనుకోవటం ఒకెత్తయితే, వారి దగ్గరకు మంత్రులను పంపి చంద్రబాబు బ్రతిమలాడు కోవటం మరో ఎత్తైపోయింది. అసలు అధికారపార్టీలో నుండి ఎంఎల్ఏలు ఎందుకు బయటకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారన్నది పెద్ద పజిల్ అయిపోయింది.

ఒకవైపేమో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కాబోయే సిఎం తానే అంటూ చంద్రబాబునాయుడు ఊదరగొడుతున్నారు. మరోవైపేమో ఎంఎల్ఏలు చంద్రబాబు మాటలు పట్టించుకోకుండా పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారంటే అర్ధమేంటి ? పోయిన ఎన్నికల్లో నవోదయ పార్టీ తరపున గెలిచిన ఆమంచిని టిడిపిలోకి లాక్కున్నారు చంద్రబాబు. అప్పటి నుండి అసోసియేట్ సభ్యునిగానే ఆమంచి కంటిన్యు అవుతున్నారు. దాదాపు నాలుగేళ్ళు టిడిపి సభ్యుని హోదాలోనే ఆమంచి అధికారాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశారు.

తీరా ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో టిడిపిలో ఉండాలా అనే విషయంలో నియోజకవర్గంలో వరుసబెట్టి మద్దతుదారులతో సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఆ విషయం తెలిసి చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోయింది. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక మంత్రి సిద్ధా రాఘవరావును ఆమంచి ఇంటికి పంపారు. ఎలాగైనా సరే ఆమంచిని టిడిపిలోనే కొనసాగేట్లుగా ఒప్పించాలని మంత్రిని చంద్రబాబు ఆదేశించారు. దాంతో ఆఘమేఘాల మధ్య మంత్రి ఆమంచి ఇంటికి వెళ్ళారు.

సరే వారి మధ్య ఏం చర్చలు జరిగిందన్నది తెలీదనుకోండి అది వేరే సంగతి. ఇంతకీ ఆమంచి ఏం చేయబోతున్నారంటే వైసిపిలో చేరటానికి తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారట. ఇపుడు ఆమంచి పార్టీని వదిలిపోయే బిజిలో ఉన్నారు. మొన్ననే రాజంపేట ఎంఎల్ఏ మేడా మల్లికార్జున రెడ్డి రాజీనామా చేశారు. అంతుకుముందు రావెల కిషోర్ బాబు వెళ్ళిపోయారు. రాబోయే రోజుల్లో ఇంకెతమంది ఎంఎల్ఏలు టిడిపిని వదిలేస్తారో అనే టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోంది.