ఏ విషయంలో అయినా సరే… తగ్గేదేలే అన్నట్లుగా సాగిపోతుండటం చంద్రబాబు నైజం అని అంటుంటారు ఆయన అభిమానులు. ఇందులో భాగంగానే దేశానికి ఐటీని పరిచయం చేసింది తానే అని చెప్పుకున్నా.. సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అని చెప్పుకున్నా అది బాబుకే సొంతం అని అంటుంటారు. ఈ క్రమంలో తాజా అవినీతి కేసుల విషయంలో బాబు పేరిట సరికొత్త రికార్డ్ నమోదైందని తెలుస్తుంది.
దేశంలో ఏ గొప్ప విషయం జరిగినా… అది తన గొప్పతనే అని చెప్పుకుంటారని ప్రత్యర్థులు చంద్రబాబుపై వెటకారం ఆడుతుంటారు. ఈ సమయంలో 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబు పేరున వరుస రికార్డులు నమోదవుతున్నాయని ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు. అందులో భాగంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2019 ఎన్నికల్లో 23 సీట్లతో ఘోర ఓటమి పొందడం కూడా రికార్డే అని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే… తాజా రికార్డ్ ఏమిటంటే… ఏకకాలంలో మూడు కోర్టుల్లో కేసుల మీద కేసుల్లో పిటీషన్లు వేయటం కూడా రికార్డే అంటున్నారు. గతంలో ఎవరు కూడా ఇన్ని కోర్టుల్లో ఇన్నేసి పిటీషన్లు దాదాపూ ఒకేసారి వేయలేదట. ఒక్కరోజులో చంద్రబాబుకు సంబంధించిన పిటీషన్లు అటు ఏసీబీ కోర్టు, హైకోర్టు ఇటు సుప్రీంకోర్టులో మొత్తం ఎనిమిది కేసులు హియరింగ్ జరగటం పెద్ద రికార్డని చెబుతున్నారు.
అంతే కాదు సుమా… మూడు కోర్టుల్లో కలిపి చంద్రబాబు తరపున సుమారు 58 మంది లాయర్లు వాదనలకు సిద్ధమవ్వటం కూడా సరికొత్త రికార్డ్ అని చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టులో నలుగురు సీనియర్ లాయర్లు వాదనలు వినిపించటం కూడా రికార్డే అని చెబుతున్నారు.
అవును… ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మూడు కోర్టుల్లోనూ కలిపి మొత్తం 58 మంది లాయర్లు చంద్రబాబు కేసులను వాదిస్తున్నారట. వీరిలో సీనియర్ మోస్ట్ లాయర్లు అయిన సిద్ధర్థ్ లూథ్రా, హరీష్ సాల్వే, సింఘ్వి లాంటి వాళ్లు రోజుకు సుమారు రూ.1-1.5 కోట్లు ఫీజులు వసూలు చేస్తారని చెబుతున్నారు.
అలాగే మరికొందరు లాయర్లు రోజుకు రూ.10 లక్షలు, ఇంకొందరు రోజుకు రూ. 2-5 లక్షల మధ్యలో వసూలు చేసే వాళ్లూ ఉన్నారని అంటున్నారు. వీళ్ళ ఫీజులను బట్టి సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం నుంచి లాయర్లకు టీడీపీ ఎంత మొత్తం చెల్లించిందో లెక్కలేసుకోవాలని అంటున్నారు నెటిజన్లు. దానిపైనా క్లారిటీ వస్తే… అది కూడా రికార్డే!