జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. పంచాయతీ స్థాయిలో కూడా రహదారుల అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే, ఇప్పటివరకు ఈ పనుల్లో అవాంతరాలు ఎదురవుతూ వస్తున్నాయి.
ఇప్పటివరకు, రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పనుల్లో కేవలం 30 శాతం మాత్రమే పూర్తి అయినట్లు అధికార నివేదికల్లో తేలింది. 2672 కోట్ల నిధులు ఇప్పటికే విడుదలైనప్పటికీ, పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. పనులు నిలిపివేతకు కారణంగా కొందరు స్థానిక నేతల జోక్యమని అధికారులు వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించడంలో ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం అందుతోంది.

ఈ విషయమై పవన్ కళ్యాణ్ విభాగాలకు ప్రశ్నల వర్షం కురిపించారు. పనులు ముందుకు సాగకపోవడం వెనుక కారణాలను అడిగారు. అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతల జోక్యం వల్ల పనులు నిలిచిపోయినట్లు ఆయన గమనించారు. కాంట్రాక్టర్లకు అనవసరమైన అడ్డంకులు పెట్టడం, రహదారుల పనులు ఆలస్యం కావడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్ అండ్ బీ అధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక నివేదికను పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా, సంబంధిత ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రికి ఈ సమస్యలను నివేదించి, బాధ్యులపై క్లాస్ తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ చర్యలు రహదారుల అభివృద్ధికి ఊతమిస్తాయా, లేక ఈ సమస్యలు మరింత ఆలస్యం చేస్తాయా అన్నది వేచి చూడాలి. ప్రజలు మాత్రం త్వరలోనే పనులు పూర్తి కావాలని ఆశిస్తున్నారు.

