బీహార్ ఎన్నికలు,ఆంధ్ర ప్రదేశ్ లో ఊగిసలాడుతున్న జనసేనకి కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకూ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామా? అని పునరాలోచనలో పడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీహార్ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం కొంత ఆశలు పెంచాయనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తమ కూటమి సయితం విజయం దిశగా అడుగులు వేస్తుందన్న నమ్మకంతో పవన్ కల్యాణ్ ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీ నిర్ణయాలు పవన్ కల్యాణ్ కు కొంత ఇబ్బందిగా మారాయి.
ప్రధానంగా రాజధాని అమరావతి అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పవన్ కల్యాణ్ ను ఇబ్బంది పెట్టాయి. దీంతో పాటు మోదీ ఇమేజ్ దేశ వ్యాప్తంగా తగ్గుతుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వీటన్నింటీని పటా పంచలు చేస్తూ బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దీనికి మోదీ ఇమేజ్ ప్రధాన కారణం. కరోనా ప్రభావం కూడా బీహార్ ఎన్నికల్లో పెద్దగా చూపలేదు. దీంతో పాటు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ చూపిన పెరఫ్మార్మెన్స్ కు పవన్ కల్యాణ ముగ్దుడయ్యారంటున్నారు.
దీంతో పవన్ కల్యాణ్ త్వరలోనే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్దమవుతున్నారు. బీజేపీతో కలసి జగన్ ను ఢీకొట్టి తీరగలమన్న నమ్మకం పవన్ కల్యాణ్ లో కలిగిందంటున్నారు. తెలుగుదేశం పార్టీ ని ఏపీలో మరో కాంగ్రెస్ లా బీజేపీ చేయగలదన్న విశ్వాసాన్ని జనసేన నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ను తెలంగాణలో నిర్వీర్యం చేసినట్లే ఏపీలో తెలుగుదేశం పార్టీ ని కూడా ధర్డ్ పొజిషన్ లోకి నెట్టగలిగే సత్తా బీజేపీకి ఉందని పవన్ కల్యాణ్ విశ్వసిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో బీజేపీకి ఉన్న బలంతో పాటు తన గ్లామర్, ఓటు బ్యాంకు కూడా ఉపయోగ పడుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకోసమే తాను అంగీకరించిన సినిమా షూటింగ్ లు పూర్తయిన వెంటనే పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి పవన్ కల్యాణ్ కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేయకుండా, చంద్రబాబును కూడా లక్ష్యంగా చేసుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బీజేపీపైన పవన్ కల్యాణ్ కు పూర్తి స్థాయిలో నమ్మకం ఏర్పడింది.