ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉచిత పథకాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అని చెబుతూ డబ్బులను పప్పూబెల్లాలలా పంచి పెడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే అమలు చేస్తున్న పథకాల విషయంలో వైసీపీ సర్కార్ అభిప్రాయం మరో విధంగా ఉంది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి ఒక అర్థం, పరమార్థం ఉందని వైసీపీ చెబుతోంది.
ప్రజలకు విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్కూళ్లలో పిల్లల చేరికలు గణనీయంగా పడిపోయాయి కాబట్టే అమ్మఒడి అమలు చేస్తున్నామని స్వయం సహాయక బృందాలు ఎన్‌పీయేలయ్యాయి కాబట్టే వైఎస్సార్ ఆసరా స్కీమ్ ను అమలు చేస్తున్నామని విద్యావ్యవస్థ అభివృద్ధి కోసమే నాడు నేడు అమలు చేస్తున్నామని రైతులు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతోనే రైతు భరోసా స్కీమ్ ను అమలు చేస్తున్నామని వైసీపీ చెబుతోంది.
విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని వైసీపీ చెబుతుండటం గమనార్హం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాల అమలును ఆపబోమని జగన్ సర్కార్ చెబుతోంది. అయితే సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్న డబ్బులో పది శాతం కూడా జగన్ సర్కార్ అభివృద్ధి కోసం ఖర్చు చేయడం లేదు. ఫలితంగా కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ లేదా జనసేన అధికారంలోకి రావాలంటే వైసీపీ సర్కార్ ను మించిన సంక్షేమ పథకాలను ప్రకటించాలి. అయితే అలా చేయడం సులువు కాదు. టీడీపీ లేదా జనసేన అధికారంలోకి వచ్చి వైసీపీ అమలు చేసిన పథకాలను ఆపితే ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది. సంక్షేమ పథకాల విషయంలో జగన్ సర్కార్ టీడీపీ, జనసేనలకు ముందు నొయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితిని తెచ్చింది. జగన్ పథకాలను అమలు చేయడం చంద్రబాబు, పవన్ లకు సాధ్యమవుతుందో లేదో చూడాలి.