జనసేనలో మొదలైన భారీ చేరికలు

కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల నుంచి సీనియర్ లీడర్స్ సహా కార్యకర్తలు భారీ ఎత్తున జనసేనలో చేరుతున్నారు. మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్తా గోపాలకృష్ణ, ఆయన పెద్ద కుమారుడు శశిధర్. 500 మంది అనుచరులతో కలిసి కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చారు ముత్తా గోపాలకృష్ణ.

జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో గోపాలకృష్ణకు ప్రత్యేక స్థానం కల్పించనున్నారు పవన్ కళ్యాణ్. జనసేనలో చేరిన వాళ్ళలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, టీడీపీ నుంచి మాకినేడి శేషు కుమారి.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముత్తా గోపాలకృష్ణ గారిని మనస్పూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. పార్టీలో పెద్దలు, అనుభవజ్ఞులు పార్టీకి అవసరం. ముత్తా గోపాలకృష్ణ జనసేనలోకి రావడం చాలా ఆనందంగా ఉంది.ముత్తా గోపాలకృష్ణ పై నాకు అపార నమ్మకం ఉంది. ఆయనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పిస్తున్నా. ఆయన అనుభవం పార్టీకి కావాలి.

జనసేన కార్యకర్తలకు సత్ప్రవర్తన ఉంది. రాబోయేతరం వారికి ముత్తా గోపాలకృష్ణ గారి అనుభవం ఎంతో పనికి వస్తుంది. కాకినాడ కోసం ఆయన ఎంతో తపిస్తున్నారు. విలువలతో పత్రికను ఆయన నడిపిస్తున్నారు. నాపైన నమ్మకం, విశ్వాసం ఉండి జనసేనలోకి వచ్చిన ముత్తా గోపాలకృష్ణ, శశిధర్ గారికి నా హృదయ పూర్వక అభినందనలు.

నేను ఏ మూలకు వెళ్ళినా ఎన్నో సమస్యలు ఉన్నాయని అర్ధం అవుతుంది. పార్టీకి దిశానిర్దేశం చేయాలని కోరుతున్నాను. పార్టీకి అండగా ఉంటారని ఆశిస్తున్నాను అని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అనంతరం జనసేన కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పవన్.