లోకేష్‌ ప్రాణాల మీదికి వచ్చినా విజయసాయిరెడ్డికి కామెడీగానే ఉందే  

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి చంద్రబాబు నాయుడన్నా, లోకేష్  అన్నా ఎంతటి కోపమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.  వారి పేర్లు చెబితేనే  నిలువెల్లా దహించుకుపోతారు ఆయన.  వారు చేసే, చేసిన ప్రతి పనినీ  అవినీతిమయం అన్నట్టు చూపిస్తుంటారు.  ఏ చిన్న పొరపాటు జరిగినా భూతద్దంలో చూపించి విమర్శలు చేస్తుంటారు.  ముఖ్యంగా లోకేష్ అంటే విజయసాయిరెడ్డికి మరీ లోకువ.  అనుక్షణం ఆయన్ను చులకన చేసి అవమానిస్తూ ఉంటారు.  విజయసాయిరెడ్డి నోటి నుండి లోకేష్ మాటంటూ వస్తే అది వెటకారమో, హేళనో అయ్యుంటుంది తప్ప వేరొకటి మాత్రం ఖచ్చితంగా కాదు.  ఆయన మాటలు వైసీపీ శ్రేణులకు తియ్యగా  టీడీపీ నేతలకు చేదుగా అనిపిస్తాయి.  కానీ ఇక్కడ చూడాల్సింది సామాన్య జనం సంగతి. 

కామన్ పీపుల్ ఏ లీడర్ మాటలను అయినా సందర్భానుసారంగానే చూస్తారు.  వారు చేసిన వ్యాఖ్యలు ఏ సందర్భాన్ని ఉద్దేశించి చేశారో ఆ సందర్భానికి సింక్ అయ్యేలా ఉన్నాయా లేదా అనేది చూస్తారు.  తాజాగా విజయసాయిరెడ్డి లోకేష్ మీద ఒక  వ్యంగాస్త్రాన్ని సంధించారు.  అది కాస్త జనానికి మింగుడుపడలేదు.  లోకేష్ తాజాగా వరద బాధిత రైతులను పరామర్శించడానికి ఆకివీడు మండలం సిద్ధాపురం వెళ్లారు.  అక్కడి రైతులతో మాట్లాడి ఆ తర్వాత నీట మునిగిన పంటలను పరిశీలించడానికి ట్రాక్టర్ మీద వెళ్లారు.  ఎప్పటిలాగే లోకేషే స్టీరింగ్ పట్టుకోగా  ఆయన పక్కన ఎమ్మెల్యే మంతెన రామరాజు లాంటి ముఖ్య లీడర్లు కూర్చున్నారు.  లోకేష్ ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న ఉప్పుటేరు కాల్వలోకి దిగిపోయింది.  వెంటనే అప్రమత్తమైన రామరాజు స్టీరింగ్ పట్టుకుని ట్రాక్టర్ ను అదుపుచేశారు. 

Netizens angry with Vijaysai Reddy tweets on Lokesh
Netizens angry with Vijaysai Reddy tweets on Lokesh

ఆయన ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే ట్రాక్టర్ పూర్తిగా కాల్వలోకి వెళ్లి బోల్తా కొట్టేదే.  ఎలాగో పెను ప్రమాదం తప్పింది.  ఈ సంఘటన విన్న ఎవరైనా పోనీలే ప్రమాదం నుండి బయటపడ్డారు అని ఊపిరిపీల్చుకుంటారు.  కానీ విజయసాయిరెడ్డి మాత్రం దాన్ని కూడ కామెడీ చేయాలనుకున్నారు.  బాబూ… చిట్టీ (లోకేశం)! ఇంతకీ నువ్వు ఎక్కిన ట్రాక్టర్‌ గుంతలో పడిందా… లేక నువ్వు ట్రాక్టర్‌ ఎక్కడం వల్ల భూమిలో గుంత పడిందా?  ప్లీజ్‌ చెప్పు! అంటూ ట్వీట్ వేశారు.  అది చూసిన నెటిజన్లు ఎంత రాజకీయ శత్రువైతే మాత్రం ఇలా ప్రాణాపాయం కలుగబోయినప్పుడు కూడ వెటకారంగానే మాట్లాడాలా.  ఇదేమీ పదవి, పవర్ కాదు ప్రాణం.  అప్పుడప్పుడైనా మామూలుగా లోచించాలి కదా అంటూ పెదవి విరుస్తున్నారు.