వైరల్ టాపిక్… నెల్లూరు పెద్దారెడ్డి కాదు.. కడప సుబ్బారెడ్డి!

గూగుల్ లో బ్రహ్మానందం కామిడీ బిట్స్ అని కొడితే టాప్ 10లో వీడియోల్లో కచ్చితంగా “నెల్లూరు పెద్దారెడ్డి” అంటూ బ్రహ్మానందం చేసిన కామెడీ వీడియో ఉంటుంది! అందులో… పోలీసులతోనే రుబాబ్ గా మాట్లాడుతూ… “నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నారా” అంటూ హడావిడి చేస్తాడు బ్రహ్మానందం. అంటే… ఆయన దృష్టిలో ఆ పేరుకు అంత పవర్ ఉందని భావన అన్నమాట! ఆ సంగతి అలా ఉంచితే… ఇప్పుడు తాజాగా “కడప సుబ్బారెడ్డి @ శ్రీకాకుళం” అనే టాపిక్ అధికార పార్టీలోనే వైరల్ గా మారింది.

అవును… తాజాగా వైసీపీ రెవిన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాద రావు… కడప సుబ్బారెడ్డి అంటూ చేసిన వ్యాఖ్యలు.. బ్రహ్మానందం చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి ఇష్యూ కంటే వైరల్ గా మారుతున్నాయి. దీంతో… ధర్మాన ప్రసాదరావు చెప్పిన ఆ కడప సుబ్బారెడ్డి ఎవరు.. ఆయన శ్రీకాకుళంలో ధర్మానకు ఆగ్రహం తెప్పించేలా ఏమి పనులు చేస్తున్నారు వంటి చర్చ తెరపైకి వచ్చింది. దీంతో… ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే… శ్రీకాకుళంలో తాజాగా కళింగ కోమటి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో మైకందుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు… కొందరు భూకబ్జాదారుల వల్ల ప్రశాంతమైన పట్టణాలు పూర్తిగా కలుషితమై పోతాయని అన్నారు. తాను నాయకుడిగా ఉన్నంత కాలం శ్రీకాకుళంలో భూకబ్జాలు జరిగితే అది తనకే అవమానం అని అన్నారు. అలాంటివి జగరనివ్వనని అన్నారు. ఇలా… ఈ విషయంపై అసలు విషయం చెప్పకుండా.. చాలా విషయాలు చెప్పిన ధర్మాన… శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు కబ్జాధారులు వస్తున్నారని మాత్రం ప్రజలను అలర్ట్ చేశారు.

ఇందులో భాగంగా… శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు సైతం అలాంటివారు వస్తే.. వారి చేతుల్లోకి భూములు వెళ్తే.. ఇక అరాచకమే రాజ్యమేలుతుందని అన్నారు. భూకబ్జా ధారుల వెనుక రౌడీలు ఉంటారని.. వారందని వెనుక మరోపెద్ద రౌడీ ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివారంతా వచ్చి ఊళ్లపై పడిపొతే ఇక మనందరి పరిస్థితి ఏమిటంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారు ఏ పార్టీకి చెందినవారైనా తాను గట్టిగా అడ్డుకుంటానంటూ ధర్మాన స్పష్టం చేశారు.

దీంతో… ఇంతకాలం టీడీపీకి చెందిన నేతలు ఉత్తరాంధ్ర భూముల్లు దోచుకున్నారంటూ విమర్శలు చేసిన ధర్మాన… సాక్ష్యాత్తు రెవిన్యూ మినిస్టర్ గా ఉంటూ కడప సుబ్బారెడ్డి అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించడంపై పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ధర్మాన చెప్పాలనుకున్న విషయం అర్ధమైంది కానీ… ఇంతకీ ఎవరి గురించి చెప్పారన్న విషయం మాత్రం అర్ధం కాలేదని అంటున్నారు నెటిజన్లు. మరి నెక్స్ట్ మీటింగ్ లో అయినా ధర్మాన ఈ విషయంపై క్లారిటీ ఇస్తారా.. లేక, తెలియాల్సినవారికి తెలిసిందిలే అని సైలంట్ గా ఉంటారా అనేది వేచి చూడాలి!