బెల్లి లలిత హత్య కేసులో నిందితుడి లొంగుబాటు

విప్లవ గాయని, తెలంగాణ గాన కోకిలగా పేరు తెచ్చుకున్న బెల్లి లలిత హత్య కేసులో నిందితుడు నోముల శ్రీనివాస్ చౌటుప్పల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బెల్లి లలితతోపాటు పౌర హక్కుల నేత పురుషోత్తం హత్య కేసులోనే అతడు నిందితుడు. అంతేకాకుండా అనేక ధౌర్జన్యాల్లో నోముల శ్రీనివాస్ పాల్గొన్నాడు. ఈ హత్యల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నోముల శ్రీనివాస్ ప్రాణ భయంతో రాష్ట్రం వదిలి పారిపోయాడు. పూర్తి వివరాలు చదవండి. 

గాయని బెల్లి లలిత తన ఆట పాటలతో నల్లగొండ జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అతి చిన్న వయసులోనే గొప్ప గాయనిగా పేరు తెచ్చుకున్నారు. 25వ ఏటనే ఆమె కిరాతక నయీం గ్యాంగ్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. దారుణాతి దారుణంగా బెల్లి లలితను 1999 మే 26వ తేదీన సాయంత్రం హత్య చేశారు. ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా కోసి ఊరికో ముక్కను పారవేశారు. ఆమె పాట, ఆటతో నల్లగొండ జిల్లాలోనే కాకుండా తెలంగాణ అంతటా గుర్తింపు తెచ్చుకున్నారు. బెల్లి లలిత హత్యకు ప్రధాన కారణం రాజ్యం. రాజ్యం చేతిలో ఉన్న హంతక నయీం ముఠా ఈ హత్య చేసింది. ఈ హత్యలో పోలీసులు, రాజకీయ నాయకులు కూడా కారకులే అన్న విమర్శలున్నాయి. 

ఆడవేషంలో నయీం

నరహంతక నయీం చచ్చినా నల్లగొండ జనాల్లో ఇంకా ఆ భయం పోలేదు. తేపకొకడు నయీం మనుషులమంటూ ఇప్పటికీ జనాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఫోన్లలో బెదిరింపులకు గురి చేస్తున్నాడు. నయీం చచ్చిన తర్వాత అతడి ప్రధాన అనుచరుడు శేషన్న ఇంకా పోలీసులకు లొంగిపోలేదు. శేషన్న తప్పించుకుని తిరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు శేషన్న పోలీసులు కనుసన్నల్లోనే ఉన్నాడన్న విమర్శలు కూడా ఉన్నాయి.

ఎవరీ నోముల శ్రీనివాస్ ?

నయీం బతికున్నంత కాలంలో  తొలినాళ్లలో నోముల శ్రీనివాస్ అనుచరుడు. తర్వాత నయీం కు శత్రువుగా తయారైండు. మరి నరహంతక నయీం అనుచరుడే శత్రువుగా భావించాడంటే అతడు ఎవరు? ఆయన కథేంటి? ఎందుకు శత్రువు అయిండు. ఇన్ని రోజులు ఎక్కడున్నడు. ఇంతకాలం తర్వాత ఎందుకు పోలీసులకు లొంగిపోయిండు. వివరాలివి.

నోముల శ్రీనివాస్ అనే వ్యక్తి ఒకప్పుడు నయీం కు ప్రధాన అనుచరుడు. విప్లవ గాయని బెల్లి లలిత, పౌరహక్కుల సంఘం నాయకుడు పురుషోత్తం ను మట్టెబట్టిన కేసులో నోముల శ్రీనివాస్ నిందితుడు. ఈ రెండు హత్యల కేసులో నిందితుడైన నోమలు శ్రీనివాస్ ది భువనగిరి మండలంలోని పడిగిపల్లి సొంతూరు.  నయీం సోదరుడైన అలీముద్దీన్ తో కలిసి శ్రీనివాస్ దందాలు చేసేవాడు. అదే అలీముద్దీన్ తో కలిసే బెల్లి లలితను, పౌరహక్కుల పురుషోత్తం ను హత్య చేసినట్లు నోమలు శ్రీనివాస్ మీద పోలీసు రికార్డుల్లో ఉంది.

1999లో బెల్లి లలితను హత్య చేసిన తర్వాత కొద్దిరోజుల్లోనే అంటే 2001లో నయీం సోదరుడు అలీముద్దీన్ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య నేపథ్యంలో నోమలు శ్రీనివాసే తన తమ్ముడి అలీముద్దీన్ గురించిన సమాచారాన్ని ప్రత్యర్థులకు అందించినట్లు నయీం అనుమానించాడు. అప్పటి నుంచి శ్రీనివాస్ మీద నయీం పగ పెంచుకున్నాడు. ఇది గమనించిన శ్రీనివాస్ నయీం తనను చంపుతాడన్న భయంతో పరారైపోయాడు. 

ప్రాణభయంతో పారిపోయిన శ్రీనివాస్ ముంబై, చెన్నై ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. నయీం ఎన్ కౌంటర్ లో చనిపోయిండని తెలిసిన తర్వాత తన ప్రాణాలకు భయం లేదని నిర్దారించుకుని శ్రీనివాస్ మెల్లగా తిరిగి వచ్చాడు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన శ్రీనివాస్ హైదరాబాద్ పోలీసులను కలిశాడు. అయితే ఇప్పటికే చౌటుప్పల్ పోలీసు స్టేషన్ లో తనపై పెండింగ్ కేసులు ఉన్నందున అక్కడే లొంగిపోవాలంటూ హైదరాబాద్ పోలీసులు సూచించారు. వారి సూచన మేరకు నోముల శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం చౌటుప్పల్ లో లొంగిపోయినట్లు తెలిసింది. 

 

తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత పాటల వీడియోలు కింద ఉన్నాయి. (మూసి టివి సౌజన్యంతో)

 

మహిళా లోకమా ¦ బెల్లి లలిత కొత్త పాట | Belli Lalitha song

 

తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత పాట / మనల మనం ఏలుకుందమెా మాయన్నల్లారా/bellilalitha song at siddipet