తెగించేసిన మోడీ… ఏపీలో అడిగే మగాడు ఉన్నాడా?

సాధారణంగా పత్రికల్లోనూ, ఆన్ లైన్ లలోనూ దర్శనమిచ్చే క్లాసిఫైడ్ యాడ్స్ ని ఏపీలో తనదైన శైలిలో ముద్రిస్తున్నారు మోడీ! అవును… “రాజమండ్రి రైల్వే స్టేషన్ అమ్మకానికి గలదు”.. “విజయవాడ విమానాశ్రయం ఫర్ సేల్”.. “తిరుపతి రైల్వే స్టేషన్ కొనాలనుకుంటున్నారా – సంప్రదించండి”.. “జాతీయ రహదారికి అతిచేరువలో ఉన్న రైల్వే స్టేషన్ అమ్మకానికి గలదు”! త్వరలో ఏపీలో దర్శనమివ్వబోయే మోడీ క్లాసిఫైడ్ ప్రకటనలు ఇవి!

నిజంగానే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తులన్నింటినీ అమ్మకానికి పెడుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది! కేంద్రప్రభుత్వానికి ఆస్తులేమిటి.. వాటిని అమ్మడం ఏమిటి అంటారా? కేంద్ర ప్రభుత్వానికంటూ ప్రత్యేకంగా ఆస్తులు ఏమీ ఉండవు.. ఆయా రాష్ట్రాల్లోని ఆస్తులను తమకున్న అధికారన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా అమ్మేయడమే!

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ పేరు చెప్పి తెగనమ్మాలని ఫిక్సయిన మోడీ సర్కార్… ఆ విషయంలో ఎవరు ఏమనుకున్నా తగ్గేదేలే అంటుంది. బరితెగింపు అనుకున్నా.. తమకు ఏమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తుంది. తాజాగా రాజ్యసభ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఏపీ ప్రజలు, స్వఛ్చంద సంస్థలు ఆందోళనలు చేస్తున్న విషయం తమకు తెలుసని… అయినా కూడా తాము ముందు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామని తెలిపింది.

అంటే… ఎవరు ఏమనుకున్నా.. ఎవరు అడ్డుకున్నా.. “ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరం” అనే కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తి లేదని కేంద్రప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పిందన్నమాట. ఫలితంగా భవిష్యత్తులో భారతదేశం మొత్తాన్ని ఒక కార్పొరేట్ కంపెనీగా మార్చాలని.. కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో దేశభవిష్యత్తును పెట్టాలని మోడీ సర్కార్ ఫిక్సయ్యిందన్నమాట. ఇందులో భాగంగా… విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికే తెగనమ్మాలని ఫిక్సయిన కేంద్రం, ఆ విషయంలో “తగ్గేదే లేదు”.. “మమ్మల్ని ఎవడ్రా ఆపేది” అంటూ తెగించేసిందన్నమాట!

ఇప్పటికే ఈ విషయంలో మోడీ ముందు సాష్టాంగ పడినట్లు బ్రతికేస్తున్న ఏపీ అధికార – ప్రతిపక్ష – బీజేపీ మిత్ర పార్టీలు ఇప్పటికైనా కల్లు తెరవాలి. డ్రామా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి.. ఎప్పుడో రాబోయే ఎన్నికల కసరత్తులు కాసేపు పక్కనపెట్టి.. ఈ విషయంపై కలిసో విడివిడిగానో.. ఏదోకటి చేయాలని… చేతులు కాలాక ఆకులు పట్టుకునే పనికిమాలిన పనిచేసి, చారిత్రక తప్పిందంగా దాన్ని మార్చొద్దని వేడుకుంటున్నారు ఏపీ వాసులు – స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు!

మరి “ఆంధుల హక్కు – విశాఖ ఉక్కు” అనే ఉద్యమ ఫలితంగా దక్కిన ఈ హక్కును ఏపీ వాసులకు ఉంచుతారా… తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం ఒకరు.. కేసులకు బయపడి మరొకరు.. మాటలకే తప్ప చేతలకు పనికిరాక ఇంకొకరు.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా మరొకరు.. అంతా కలిసి ఆంధ్రుల హక్కుని నాశనం చేస్తారా? లేక, తమకూ చీమూ నెత్తురూ ఉన్నాయని, పౌరుషానికి తాము పెట్టింది పెరని, రాష్ట్ర సంపదని అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని తెగించి, ప్రజల మనోభావాలకు తోడుగా నిలబడతారా అన్నది వేచి చూడాలి!