మారిన ప్రోగ్రాం టైటిల్… జనాల్లోకి చంద్రబాబు కుటుంబం!

అటు చంఎద్రబాబు ఫ్యామిలీ, ఇటు టీడీపీ శ్రేణులూ ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ రావడాన్ని బలమైన సంబరంగా మార్చిన నేపథ్యంలో తాజాగా వచ్చిన బెయిల్ తో తమ్ముళ్ల సంబరాలు అంబరాన్నాంటుతున్నాయని తెలుస్తుంది. ఈ విషయాలపై ఇప్పటికే నారా లోకేష్ తనదైన విశ్లేషణ అందించారు. ఈ క్రమంలో ఇక చంద్రబాబు ఫ్యామిలీ మొత్తం జనాల్లోకి వెళ్లబోతున్నారని అంటున్నారు.

చంద్రబాబు బెయిల్ పిటిషన్ జడ్జిమెంట్ సమయంలో… స్కిల్ స్కాంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు తగిన ఆధారాలు లేవని జడ్జి అభిప్రాయపడటం అనే వాక్యం ఇప్పుడు టీడీపీకి ఎక్కడ లేని బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. దీనితోపాటు స్కాం కేసులో చంద్రబాబు అవినీతిని నిరూపించటంలో సీఐడీ ఫెయిలైందని చెప్పటం, స్కాం సొమ్ములు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరాయనే ఆధారాలు లేవని చెప్పటం లాంటి అనేక ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.

ఆ వ్యాఖ్యలను చూసినపుడు కేసు విచారణ జరిగి తీర్పిచ్చినట్లుగానే అనిపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నప్పటికీ… ప్రస్తుతానికి రాజకీయంగా టీడీపీకి తాజా బెయిల్ తో పాటు ఆ బెయిల్ ఇచ్చే సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు సరికొత్త ఉత్సాహాన్నిచ్చాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి! దీంతో మధ్యలోనే ఆపేసిన యువగళం, నిజం గెలవాలి వంటి కార్యక్రమాలు రీస్టార్ట్ కాబోతున్నాయని.. రెట్టించని ఉత్సాహంతో బాబు కుటుంబ సభ్యులు జనాల్లోకి వెళ్లబోతున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా ఈనెల 24 నుండి యువగళం పాదయాత్రను లోకేష్ పునఃప్రారంభించబోతున్నారని పార్టీవర్గాలు చెప్పాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతుందని అంటున్నారు. తండ్రి బయటకు రావడంతో చినబాబు రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్రలో పాల్గొంటారని శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఇదే సమయంలో అలాగే ఈ నెల 26వ తేదీ నుండి “నిజం గెలిచింది”అనే నినాదంతో భువనేశ్వరి బస్సుయాత్రను మొదలుపెట్టబోతున్నారని అంటున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నసమయంలో “నిజం గెలవాలి” అని భువనేశ్వరి యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ సందర్భంగా హైకోర్టు జడ్జి చేసిన తాజా వ్యాఖ్యలతో “నిజం గెలిచింది” అనే యాత్రకు భువనేశ్వరి రెడీ అవుతున్నారని అంటున్నారు.

ఇక ఆరోగ్యం కాస్త కుదుటిపడిన తర్వాత అంబులెన్స్ ను వెంటపెట్టుకునే… డిసెంబర్ మొదటి వారంలో చంద్రబాబు కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్రలు చేయచ్చని సమాచారం! ఈ భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్రలో ఉండగానే సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీత్మో.. అదే యాత్రను తిరిగి ప్రారంభించాలని బాబు ఫిక్సయ్యారని అంటున్నారు. దీంతో టీడీపీలో సరికొత్త ఉత్సాహం నెలకొందని తెలుస్తుంది.

కాగా… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుందని తెలుస్తుంది. ఈ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ జరగకుండానే తీర్పు ఇచ్చినట్లు ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించిందని.. ఈ వ్యాఖ్యలు పరిధిని దాటి ఉన్నాయని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారని తెలుస్తుంది!