నందమూరి వంశానికి ‘నారా’ శాపమా.?

అసలు ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతోంది.? ఏమో.! ఇదింతే, ఈ రాజకీయం ఇంతే. నందమూరి వంశానికి ‘నారా’ శాపమేంటి.? నారా చంద్రబాబునాయుడి వల్లనే నందమూరి తారక రామారావు రాజకీయంగా వెన్నుపోటుకు గురయ్యారన్నది ఓ వాదన.

కాదు కాదు.. నందమూరి కుటుంబంలో లక్ష్మీపార్వతి చిచ్చు పెడితే, విధిలేని పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు చేసిన ‘నాయకత్వ మార్పు’ ప్రయత్నమే ఆనాటి ఆ ‘వెన్నుపోటు’ వెనుక వున్న అసలు విషయం.. అంటారు కొందరు. ఏది నిజం.? అంటే, ఒక్కటైతే నిజం.. స్వర్గీయ ఎన్టీయార్ మానసికంగా కుంగిపోయారు.. ఆయన మరణానికి ఆ వెన్నపోటు ఘటనే కారణం.

వ్యక్తుల కంటే పార్టీ గొప్పది.. అన్న మాట వినడానికి బావుంటుంది. కానీ, పార్టీని స్థాపించిన వ్యక్తినే రాజకీయంగా మట్టుబెట్టే ప్రయత్నం.. చివరికి అది భౌతికంగా ఆయన్ని మట్టుబెట్టే స్థితికి కారణమవుతుందంటే.. దాన్నెలా సమర్థించగలం.?

అది గతం. ప్రస్తుతం విషయానికొస్తే, ఇక్కడ జరిగింది వేరు. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు ‘యువ గళం’ పేరుతో. అదే రోజు, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నందమూరి తారక రత్న.. అదే పాదయాత్ర సందర్భంగా గుండె పోటుకు గురయ్యారు.

ప్రస్తుతం తారక రత్న పరిస్థితి విషమంగానే వుంది. ఈ నేపథ్యంలోనే నందమూరికి ‘నారా పోటు’ అన్న విమర్శలొస్తున్నాయ్. నిజానికి, ఈ చర్చ అవాంఛనీయం. కానీ, టీడీపీ వర్సెస్ వైసీపీ.. సోషల్ మీడియాలో నడుస్తున్న మాటల యుద్ధం.. ఇలాంటి ప్రస్తావనలకు తావిస్తోంది.