టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్రలో 4000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తారట. సుమారు 400 రోజులపాటు ఈ పాదయాత్ర జరుగుతుందని స్వయంగా నారా లోకేష్ ప్రకటించేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు.. మధ్యలో చంద్రబాబు, షర్మిల.. ఇలా చాలా పాదయాత్రలు తెలుగునాట జనం చూసేశారు. చంద్రబాబు, వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పాదయాత్రల ద్వారా అధికార పీఠమెక్కిన సంగతి తెలిసిందే.
సో, నారా లోకేష్ పాదయాత్ర ద్వారా ఎవరు అధికారంలోకి వస్తారు.? చంద్రబాబేమో చివరి ఛాన్స్ అంటున్నారు. సో, తండ్రి కోసమే నారా లోకేష్ ఈ పాదయాత్ర చేస్తున్నారని అనుకోవాలి. ఇంతకీ, నారా లోకేష్ పాదయాత్ర సజావుగా సాగుతుందా.? సాగే అవకాశముంది.. కానీ, వైసీపీ శ్రేణులకు బీపీ రాకూడదు. బీపీ వస్తే, టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్నే గతంలో ధ్వంసం చేసేసినట్టు.. నారా లోకేష్ పాద యాత్ర మీద కూడా విరుచుకుపడే ప్రమాదముంది.
అన్నిటికీ మించి, పాదయాత్రకు అనుమతులు ఎలా.? రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎలాగంటే అలా తిరిగే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోందాయె. సవాలక్ష ఆంక్షలూ తప్పడంలేదు. ఏదో ఒక సాకు చూపి, నారా లోకేష్ పాదయాత్ర చేయకుండా అడ్డుకోగల శక్తి అధికార వైసీపీకి వుంది. సో, లోకేష్ పాదయాత్ర చేస్తానని ప్రకటించేస్తే సరిపోదు.. దానికి చాలా వ్యవహారాలున్నాయ్.