ఏపీలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో వైరస్ కట్టడికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ వైరస్ కట్టడిలో ముందుండి పోరాడుతున్న వైద్య, పోలీస్, పారిశుధ్య, అత్యవసర సర్వీసులు అందిస్తున్న వారిలో చాలా మంది కరోనా కాటుకు గురవుతున్నారు. అయితే తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా కట్టడికి కృషి చేస్తున్నవారితోపాటే జర్నలిస్టులు కూడా తమ విధులు నిర్వర్తిస్తూ పనిచేస్తున్నారు.
అయితే వైరస్ పట్ల ప్రజలను చైతన్యపరిచేలా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో కలిసి పనిచేస్తుండడంతో రోజుకో జర్నలిస్టు మృత్యువాత పడుతున్నారు. అయితే దీనిపై తీవ్ర ఆందోళనకు గురైన టీడీపీ నేత నారా లోకేశ్ జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూనే తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చి ఒక బీమా స్కీమ్‌ని జర్నలిస్టులకు చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో పనిచేస్తోన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ కలిపి మొత్తం 62 మందికి ఈ బీమా కల్పించారు.
ఈ ఇన్సూరెన్స్‌కి సంబంధించిన పత్రాలను ఆయా జర్నలిస్టులకు అందజేయనున్నారు. జూలై 15 నుంచి అమలులోకొచ్చిన ఈ జర్నలిస్టుల బీమాతో వారికి ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబాలకు ధీమా కల్పించేందుకు తన తరుపున ఈ సహాయాన్ని చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ భీమా పొందిన జర్నలిస్టులో కరోనా వైరస్ సోకి చనిపోతే నామినీకి 10 లక్షలు, ప్రమాదంలో ఎవరైనా జర్నలిస్టులు మృతి చెందితే వారి నామినీలకు 20 లక్షలు అందేలా భీమాను రూపొందించారు.