స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గురువారం సాయంత్రం ఆయనకు స్కిన్ అలర్జీ వచ్చిందని తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన జైలు అధికారులు.. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులను పిలిపించి చికిత్స అందించారు. అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నట్లుగా రిపోర్ట్ లో అంతా నార్మల్ గానే ఉంది.
అయితే… గత కొన్ని రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండటంతో, వేడి పెరిగి బాబు డీహైడ్రేషన్ కు గురవుతున్నారని అంటున్నారు. మరోపక్క చర్మ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, స్కిన్ పై అక్కడక్కడా దద్దుర్లు, ఎర్రమచ్చలూ వచ్చాయని వార్తలొచ్చాయి! ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో… చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ “జైల్ భరో” కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నేతలు చెపట్టారు. ఇదే సమయంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. ఆయనకు ఇప్పుడు అత్యవసర వైద్య సేవలు అవసరం అని ఆమె తెలిపారు. ఇదే సమయంలో లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేశారు.
ఇందులో భాగంగా… చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని.. ఆయనపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని.. ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. జైల్లో దోమలు, కలుషిత నీటితో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అనంతరం… చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్ దే బాధ్యత అని లోకేష్ తెలిపారు.
ఇదే సమయంలో చంద్రబాబు బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. జైలులో పరిస్థితులు బాబుకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ మేరకు భువనేశ్వరి మరిన్ని విషయాలు వెల్లడిస్తూ ట్వీట్ చేశారు.
ఇందులో భాగంగా… “జైలులో నా భర్తకు సకాలంలో వైద్యం అందించట్లేదు. ఇప్పటికే ఆయన 5 కిలోల బరువు తగ్గారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. జైలులో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి. జైలులో పరిస్థితులు నా భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయి. చంద్రబాబుకు అత్యవసరం వైద్యం అవసరం” అని తెలిపారు.