ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించి అక్రమాలు జరిగాయన్నది వైసీపీ ఆరోపణ. ఈ మేరకు వైసీపీ సర్కారు, ఇప్పటికే సీఐడీని రంగంలోకి దించింది. పలు కేసులూ నమోదయ్యాయి. ఈ కేసులో చంద్రబాబుని బుక్ చేయడానికి వ్యూహం సిద్ధమయ్యింది కూడా.
ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ని కూడా నిందితుడిగా చేర్చింది ఏపీ సీఐడీ. నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టగానే, ఆయన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
తన తండ్రి చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో, ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు నారా లోకేష్.. అదీ, యువగళం పాదయాత్రను అర్థాంతరంగా ఆపేసి మరీ.! తాజాగా తనను నిందితుడిగా సీఐడీ పేర్కొనడాన్ని నారా లోకేష్ తప్పు పడుతున్నారు.
‘మేం అధికారంలోకి వస్తాం.. రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాం.. అదీ, నా వ్యక్తిగతంగా..’ అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా.? అన్నది వేరే వ్యవహారం. ఇప్పటికైతే, చంద్రబాబే జైలు నుంచి బయటకు రాలేక నానా తంటాలూ పడుతున్నారు.
అదే, నారా లోకేష్ కూడా అరెస్టయితే.. ఇక అంతే సంగతులు.! 2024 ఎన్నికల్లోపు చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని వైసీపీ గట్టిగా చెబుతోంది. ఇదే మాట, నారా లోకేష్‌కి కూడా వర్తించొచ్చు.
చంద్రబాబు జైలుకు వెళ్ళిన దరిమిలా, నందమూరి బాలకృష్ణ కాస్త హడావిడి చేయబోయి అభాసుపలయ్యారు. బ్రాహ్మణి, భువనేశ్వరి పరిస్థితీ అంతే.!