స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత మూడు వారాలకు పైగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అత్యంత కీలకమైన క్వాష్ పిటిషన్ ఈ నెల మూడున సుప్రీంలో విచారణకు రానుంది. ఇదే సమయంలో ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసులో ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని సుప్రీంకోర్టును కోరింది.
ఆ సంగతి అలా ఉంటే… స్కిల్ స్కాం అనంతరం ఏపీ సీఐడీ దృష్టి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం పై ఉన్నట్లుగా ఉంది! ఈ కేసులో ఇప్పటికే ఏ1 గా ఉన్న బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఇక ఏ2గా ఉన్న మాజీమంత్రి నారాయణ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. మరోపక్క ఏ14గా చినబాబు ఈ నెల 4న విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది!
ఈ సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం కేసులో.. మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు పంపింది. అక్టోబర్ 4వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దీంతో… ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే.. విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైనట్లయ్యింది.
కాగా… అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో ఏ2గా ఉన్న నారాయణ.. మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మరోసారి విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నారా లోకేష్ కు ఈ స్కాం లో కీలక పాత్ర ఉందని నిర్ధారించుకున్న ఏపీ సీఐడీ.. కోర్టు ఆదేశాల ప్రకారం నోటీసులు ఇచ్చి అక్టోబర్ 4 న విచారణకు హాజరవమని చెప్పిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ స్కాం లోనే కాకుండా.. నాటి ప్రభుత్వంలోనూ అత్యంత కీలకంగా ఉన్న మాజీమంత్రులైన నారాయణ, లోకేష్ లు ఇద్దరినీ ఒకేరోజు విచారణకు రామనడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ రోజు ఏమి జరగబోతోందనేది వేచి చూడాలి! అదే రోజు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు రానుంది!