డ్రైవింగ్ సీట్‌లో నారా భువనేశ్వరి.?

తెలుగుదేశం పార్టీని నడిపే బాధ్యతని నారా భువనేశ్వరి తీసుకోబోతున్నారా.? టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా ఆమెను, పార్టీ అధినేత చంద్రబాబు నియమించనున్నారా.? ప్రస్తుత పరిణామాలు చూస్తోంటే, ఔననే అనుమానం కలగడంలో వింతేముంది.? రేపో మాపో ఈ విషయమై పూర్తి స్పష్టత రాబోతోందిట.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకి ఈ కేసులో ఊరట దొరకడంలేదు. ఒకవేళ ఈ కేసులో ఊరట దక్కినా, మరిన్ని కేసుల్లో ఆయన్ని అరెస్టు చేసేందుకు అధికార వైసీపీ, అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వైసీపీ ఆదేశాల మేరకు, దర్యాప్తు సంస్థలూ పకడ్బందీగా చంద్రబాబుని ఇరకాటంలో పెట్టడానికి సిద్ధంగా వున్నాయ్.

ఈ నేపథ్యంలో, పార్టీకి రధ సారధి అవసరమన్న భావనలో పార్టీ శ్రేణులు వున్నాయి. నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ఆగిపోయింది. ఆయన పాదయాత్రని తిరిగి కొనసాగించాలన్నా, పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షించే ‘నాయకత్వం’ అవసరం. బాలకృష్ణ నుంచి ఆ స్థాయి భరోసా కష్టమే.

దాంతో, నారా భువనేశ్వరి పేరుని పలువురు పార్టీ సీనియర్లు ప్రతిపాదిస్తున్నారు. భువనేశ్వరి గౌరవాధ్యక్షురాలిగా వుంటే, సింపతీ వేవ్ కూడా వర్కవుట్ అవుతుందని, ములాఖత్ సందర్భంగా చంద్రబాబుకి సమాచారం అందించారట టీడీపీ ముఖ్య నేతలు కొందరు. చంద్రబాబు కూడా ఈ విషయమై సానుకూలంగానే వున్నట్లు తెలుస్తోంది.

త్వరలో భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకి ముందే, పార్టీ పదవితో ఆమె కొన్ని ముఖ్యమైన సమావేశాలు పార్టీ శ్రేణులతో నిర్వహిస్తారట.