“పబ్లిక్” గా అడిగినా పట్టించుకోవడం లేదు… మీకు అర్ధమవుతుందా?

ఏదో అనుకుంటే మరేదో అయ్యిందనుకోవాలో.. లేక, ప్రభుత్వం అనుకున్నట్లుగానే జరుగుతుంది అనుకోవాలో తెలియదు కానీ… చంద్రబాబు అరెస్ట్ తర్వాత అనుకున్న స్థాయిలో జరగాల్సిన నిరసన జరగలేదనే కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ సమయంలో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయాలని, పోరాడాలని పబ్లిక్ గానే పిలుపునిస్తున్నా కూడా పబ్లిక్ రెస్పాండ్ అవ్వడం లేదని అంటున్నారు.

చంద్రబాబునాయుడును శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేయగానే భువనేశ్వరి విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు కష్టమంతా జనాల కోసమే అని.. 24 గంటలూ ప్రజల సంక్షేమం కోసం కష్టపడే వ్యక్తిని.. ప్రభుత్వం తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేసిందని చెప్పుకొచ్చారు.

అనంతరం ఇంతకాలం రాష్ట్రం కోసం కష్టపడిన చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత జనాల మీదే ఉందని చెప్పుకొచ్చారు. కాబట్టి జనాలంతా రోడ్లపైకి రావాలని పిలుపిచ్చారు. అయితే సాదారణ ప్రజానికం సంగతి దేవుడెరుగు… కనీసం పార్టీ జనాలు కూడా రోడ్లపైకి రాలేదు. దీంతో అచ్చెన్నాయుడు హర్ట్ అయ్యారు. వెంటనే కాంఫరెన్స్ లోకి వచ్చారు.

కనీసం విజయవాడ నగర పరిధిలోని నాయకులైనా రియాక్ట్ అవ్వాలని, జన సమీకరణ చేయాలని, వారిలో మహిళలు ఎక్కువగా ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో లీకయ్యింది. అయినప్పటికీ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఊహించిన స్థాయిలో రియాక్ట్ అవ్వలేదనే కామెంట్లు వినిపించాయి.

అనంతరం చినబాబు, టీడీపీ భవిష్యత్ ఆశా కిరణం నారా లోకేష్ స్పందించారు. జనాలంతా రోడ్లపైకి వచ్చి చంద్రబాబును కాపాడుకోవాలని సూచించారు. చంద్రబాబు కష్టమంతా జనాల కోసం రాష్ట్రాభివృద్ధి కోసమే అని చెప్పుకొచ్చారు. కాబట్టి జనాలంతా సైకో పాలనకు నిరసనగా రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు!

అనంతరం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా బాలయ్య లైన్ లోకి వచ్చారు. తాజాగా విజయవాడ టీడీపీ ఆఫీసులో మైకందుకున్న ఆయన… రాష్ట్రం కోసం బ్రతికిన చంద్రబాబు కోసం జనాలందరూ రోడ్లపైకి రావాలని, వచ్చి నిరసనలు తెలపాలని అన్నారు. తాను ముందు ఉండి పార్టీని నడిపిస్తానని, జనాలంతా రోడ్లపైకి రావాలన్నారు. అయినా కూడా జనం వినడంలేదని అంటున్నారు!

ఇలా పబ్లిక్ అంతా రోడ్లపైకి రావాలని పబ్లిక్ గానే పిలుపునిస్తున్నా కూడా.. జనం రియాక్ట్ అవ్వడం లేదని తెలుస్తుంది. పట్టుమని పదిమంది కూడా లేకుండా స్టేజ్ లు వేసుకుని, వాటిపై కుర్చీలేసుకుని కుర్చిని దీక్షలు చేయడం మినహా సరైన స్పందన లేదని అంటున్నారు. దీంతో జనాలు చంద్రబాబు అరెస్టును సీరియస్‌గా తీసుకోలేదనే అనిపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.