అప్పుడు ప్ర‌లోభ‌పెట్టారు… ఇపుడు హామీలిచ్చారు (వీడియో)

ఫిరాయింపులను ప్రోత్స‌హించ‌ట‌మే ఏకైక ల‌క్ష్యంతో ఆప్పుడేమో వైసిపి ఎంఎల్ఏలు, ఎంపిల‌కు ప్ర‌లోభాల‌ను ఎర‌గా వేశారు. ఆ ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి వైసిపి త‌ర‌పున పోయిన ఎన్నిక‌ల్లో గెలిచిన 22 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించారు. అలా ఫిరాయించిన వాళ్ళ‌ల్లో మావోయిస్తుల చేతిలో హ‌త్య‌కు గురైన కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు కూడా ఒక‌రు. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అర‌కు ఎంఎల్ఏగా వైసిపి త‌ర‌పున గెలిచిన కిడారి త‌ర్వాత చంద్ర‌బాబు ప్ర‌లోభాల‌కు లొంగి తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

తాను ఫిరాయించ‌టానికి కార‌ణ‌ల‌ను కూడా చ‌నిపోయే ముందు స్వ‌యంగా కిడారే మావోయిస్టుల‌కు వివ‌రించిన కార‌ణాల‌ను విని యావ‌త్ ప్ర‌పంచం విస్తుపోయింది. టిడిపిలోకి ఫిరాయించినందుకు ఎంఎల్ఏకి రూ 12 కోట్లు ముట్టిన‌ట్లు ఆయ‌నే చెప్పారు. మంత్రి ప‌ద‌వి కూడా ఇస్తాన‌న‌న్నార‌ట‌. మైనింగ్ చేసుకునేందుకు లైసెన్సులు బోన‌స్ గా వ‌చ్చింది. ఆ ప్ర‌లోభాలే చివ‌ర‌కు కిడారి ప్రాణాలు బ‌లి తీసుకుందన్న‌ది వాస్త‌వం. ప్ర‌లోభాల‌కు గురికాకుండా ఉండుంటే విలువైన ప్రాణాలు ద‌క్కేవేమో ?

అంతా అయిపోయిన త‌ర్వాత ఇపుడు తీరిగ్గా చంద్ర‌బాబు మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారు. ఎంఎల్ఏ కుటుంబానికి ప్ర‌భుత్వం త‌ర‌పున కోటి రూపాయ‌ల ఆర్దిక సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. రెండో కొడుక్కి గ్రూప్ 1 అధికారి పోస్టు ఇస్తార‌ట‌. పెద్ద కొడుకును ఏ విధంగా ఆదుకోవాలో పార్టీలో చ‌ర్చించి నిర్ణ‌యిస్తార‌ట‌. ఎంఎల్ఏ కుటుంబ‌స‌భ్యుల్లో న‌లుగురికి పార్టీ త‌ర‌పున త‌లా రూ. 5 ల‌క్ష‌ల సాయం అందిస్తార‌ట‌. విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలో ఇంటి స్ధ‌లం కూడా కేటాయిస్తార‌ట‌. బాక్సైట్ గ‌నుల‌ను మూసేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా మావోయిస్టులు ఇంత ఘాత‌కానికి దిగ‌టం బాధాక‌ర‌మని చంద్ర‌బాబు చెప్ప‌టం విడ్డూరంగా ఉంది. బాక్సైట్ గ‌నుల‌ను నిజంగానే ప్ర‌భుత్వం మూసేస్తే మ‌రి ఎంఎల్ఏ త‌వ్వ‌కాలు జ‌రిపిన గ‌నులేంటి ? అంటే అన‌ధికారికంగానే కిడారి మైనింగ్ జ‌రిపుకున్న‌ట్లు చంద్ర‌బాబు అంగీక‌రించిన‌ట్లే క‌దా ?

అదేవిధంగా మాజీ ఎంఎల్ఏ సివెరిసోమ కుటుంబాన్ని కూడా చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. కుటుంబంలోని ఏడుగురు స‌భ్యుల‌కు త‌లా పది ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం త‌రపున‌, త‌లా రూ , 5ల‌క్ష‌ల పార్టీ త‌ర‌పున అందిస్తున్న‌ట్లు చెప్పారు. విశాఖ‌లో ఇంటి స్ధ‌లం ఇస్తార‌ట‌. అర‌కులో నిర్మాణంలో ఉన్న ఇల్లు పూర్త‌వ్వ‌టానికి సాయం చేస్తార‌ట‌. రెండో కొడుక్కి ప్ర‌భుత్వ స్ద‌లం ఇస్తామ‌ని కూడా చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. స‌రే, ఎలాగూ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి కాబ‌ట్టి, అందులోనూ గిరిజ‌న ప్రాంతాల్లో పార్టీని గెలిపించుకోవాలి కాబ‌ట్టి హామీలు నిల‌బెట్టుకుంటారేమో చూడాలి.