పరువు పోయేది చంద్రబాబుకే

ఎలక్షన్ కమీషన్, ప్రధాన కార్యదర్శిపై పై చెయ్యి సాధించాలని చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నం చివరకు రివర్సయ్యేట్లు కనిపిస్తోంది. క్యాబినెట్ సమావేశం నిర్వహించటం ద్వారా చంద్రబాబు కొత్తగా సాధించేదేమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడైనా తేడా వస్తే పోయేది చంద్రబాబు పరువే కానీ చీఫ్ సెక్రటరీది మాత్రం కాదు.

నిజానికి ఇపుడు క్యాబినెట్ సమావేశం పెట్టాల్సినంత అవసరం ఏమీలేదు. కానీ పంతానికి పోయి కొరివితో తల గోక్కుంటున్నారు చంద్రబాబు. క్యాబినెట్ సమావేశం నిర్వహించాలన్న చంద్రబాబు ఆదేశాలను సిఎస్ ఎలక్షన్ కమీషన్ కు పంపేస్తారు అనుమతి కోసం. ఎలక్షన్ కమీషన్ అనుమతిస్తే క్యాబినెట్ సామవేశానికి రెడీ చేస్తారు. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే అదే విషయాన్ని చంద్రబాబుకు చేరవేస్తారు. సిఎంకు ఎలక్షన్ కమీషన్ కు మధ్య సిఎస్ ఉద్యోగం కేవలం పోస్టు మ్యాన్ ఉద్యోగం లాంటిదే.

ఏమన్నా కోపముంటే అదేదో ఎలక్షన్ కమీషన్ పై చూపించాలి చంద్రబాబు. అంతేకానీ ఏమాత్రం సంబంధం లేని సిఎస్ పై చూపిస్తే అది తనకే నష్టమని  చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. క్యాబినెట్ సమావేశం పెట్టుకోనీయకుండా చంద్రబాబును అడ్డుకోవాలని సిఎస్ ప్రయత్నమేమీ చేయటం లేదు. సిఎంగా ఉన్న చంద్రబాబే చీఫ్ సెక్రటరీపై పై చెయ్యి సాధించాలని అనుకోవటంతో తన స్ధాయిని తానే దిగజార్చుకున్నట్లైంది.

చంద్రబాబుకున్నది రెండే మార్గాలు. ఒకటి ఎలక్షన్ కమీషన్ నిబంధనలను పాటించటం. అలా పాటించడం ఇష్టం లేకపోతే తాను అనుకున్నట్లుగా నిబంధనలను మార్చుకోవటం. ఇప్పటికిప్పుడు నిబంధనలను మార్పించుకోవటం చంద్రబాబుకు సాధ్యంకాదు. కాబట్టి ఎలక్షన్ కమీషన్ నిబంధనలను పాటించటమే మర్యాదగా ఉంటుంది.