టిడిపికి నెల్లూరు ఎంపి అభ్యర్ధి దొరికారోచ్..

మొత్తానికి తెలుగుదేశంపార్టీకి నెల్లూరు పార్లమెంటులో పోటీ చేసే అభ్యర్ధి దొరికారు. మాజీ మంత్రి, సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డే ఎంపిగా మరోసారి పోటీ చేయటం ఖాయమైపోయింది. నాలుగున్నరేళ్ళుగా గట్టి ఎంపి అభ్యర్ధి కోసం చంద్రబాబునాయుడు వెతుకుతున్నా దొరకలేదు. మొన్నటి వరకూ నెల్లూరు ఎంపిగా వైసిపి నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేకహోదా డిమాండ్ తో మేకపాటి ఎంపిగా రాజీనామ చేయటం, స్పీకర్ ఆమోదించటంతో ప్రస్తుతం ఎంపి స్ధానం ఖాళీగా ఉంది.  వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపిగా మేకపాటే పోటీ చేస్తారనంటో సందేహం లేదు. ఆర్ధిక, అంగ బలంలో మేకపాటి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎటుతిరిగి సమస్యంతా అధికార టిడిపితోనే.

 

అధికారంలో ఉండి కూడా టిడిపికి నెల్లూరు లోక్ సభ నుండి పోటీ చేసే అభ్యర్ధి దొరకలేదంటే ఆశ్చర్యంగా ఉంది. అందుకు కారణమేమిటంటే, ఎంపిగా పోటీ చేయటానికి నేతలెవరూ సాహసించటం లేదు. గెలుపు పై నమ్మకం లేకే అందరూ పోటికి వెనకాడుతున్నారు. అసలే నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. దానికితోడు ప్రత్యేకహోదా కోసం ఏడాది కాలముండే ఎంపి పదవిని త్యాగం చేయటం మేకపాటికి  ప్లస్ పాయింటైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేకపాటి పదవికి రాజీనామా చేశారన్న విషయం జనాల్లోకి బాగా ఎక్కింది.

 

దాంతో రేపటి ఎన్నికల్లో మేకపాటికి వ్యతిరేకంగా పోటీ చేయటానికి ఎవరూ ఇష్ట పడలేదు. ఆ  నేపధ్యంలోనే చంద్రబాబు జిల్లాలోని చాలామంది నేతలతో మాట్లాడినా ఉపయోగం కనబడలేదు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన వద్ద అంత డబ్బులేదు కాబట్టి పోటీ చేయలేనని చేతులెత్తేశారు. ఆదాలను పోటీ చేయాల్సిందిగా సోమిరెడ్డి కోరినపుడు ఆదాల కూడా కుదరదని తేల్చేశారు. సరే ఎవరు కూడా చేయకపోతే పార్టీ పరువు పోతుందన్న ఉద్దేశ్యంతో చివరకు చంద్రబాబు జోక్యం చేసుకుని పోటీ చేయమని ఆదేశించటంతో ఆదాలకు తప్పలేదు.

 

అదే విషయాన్ని ఆదాల మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించటంతో మొత్తానికి పార్టీకి ఎంపి అభ్యర్ది దొరికారంటూ మిగిలిన టిడిపి నేతలు ఊపిరిపీల్చుకున్నారు. ఆదాల జిల్లాలోని అల్లూరు నియోజకవర్గంలో 1999లో టిడిపి తరపున ఎంఎల్ఏగా గెలిచారు. తర్వాత 2004,2009లో కాంగ్రెస్ తరపున సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంఎల్ఏగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టిడిపి ఎంపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. మేకపాటికి 5,76,396 ఓట్లు రాగా ఓడిపోయిన ఆదాలకు 5,62,918 ఓట్లొచ్చాయి. నిజానికి ఆదాల ఓడిపోయింది కేవలం 14 వేల ఓట్ల తేడాతోనే అని గమనించాలి.  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మీద మేకపాటికి వచ్చిన మెజారిటి 14 వేలంటే చాలా తక్కువనే చెప్పాలి.  మరి వచ్చే ఎన్నికల్లో ఆదాల ఏ మేరకు ఫైట్ ఇస్తారో చూడాల్సిందే.