స్పీకర్ గా ఉన్న వ్యక్తి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలట. చాలా గౌరవంగా నడుచుకోవాలట. ఇలా చెబుతున్నది ఎవరో కాదు చంద్రబాబునాయుడే. అధికారంలో ఉన్న ఐదేళ్ళు అన్నీ వ్యవస్ధలను గబ్బుపట్టించినట్లే స్పీకర్ వ్యవస్ధను కూడా చంద్రబాబు పూర్తిగా దిగజార్చేశారు. తాను ఏమి చెబితే అలాగే నడుచుకోవాలన్నట్లుగా స్పీకర్ పోస్టును తయారు చేసిన చంద్రబాబు ఇపుడు బుద్ధులు చెబుతున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ టిడిపిని కోన్ కిస్కా అని వ్యాఖ్యానించారట. దానికి చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడుతూ స్పీకర్ స్ధానంలో కూర్చున్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలని చెప్పటమే విచిత్రంగా ఉంది. తాను అధికారంలో ఉండగా స్పీకర్ కోడెల శివప్రసాదరావును తాను ఏ విధంగా నియమంత్రించింది ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది.
ఫిరాయింపులకు తెర ఎత్తటం ద్వారా చంద్రబాబు స్పీకర్ వ్యవస్ధను గబ్బు పట్టించారు. పార్టీ పిరాయించిన ఏ ఎంఎల్ఏ మీద చర్యలు తీసుకోనీయకుండా స్పీకర్ ను చంద్రబాబు కంట్రోల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని వైసిపి నేతలు ఎంత మొత్తుకున్నా స్పీకర్ కనీసం సమాధానం కూడా చెప్పలేదు. అందుకు చంద్రబాబే ప్రధాన కారణం.
అదే సమయంలో స్పీకర్ గా ఉన్న కోడెల పార్టీ కార్యక్రమాల్లో కూడా నిసిగ్గుగా పాల్గొనేవారు. టిడిపికి అనుకూలంగా వైసిపికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బహిరంగ వేదికల మీద నుండే వైసిపి నేతలకు కోడెల వార్నింగులు ఇచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అప్పుడంతా చంద్రబాబుకు బ్రహ్మాండంగా అనిపించింది. అదే పద్దతిని ఇపుడు తమ్మినేని అనుసరిస్తుంటే చంద్రబాబుకు అంతా తప్పుగా కనిపిస్తుండటమే విచిత్రంగా ఉంది.