పార్టీ నేతల మధ్య ఇపుడిదే చర్చ జరుగుతోంది. లేకపోతే టికెట్ ఇచ్చేది లేదని చెప్పేసిన తర్వాత మళ్ళీ అదే అభ్యర్ధికి చంద్రబాబు పిలిచి టికెట్ ఇచ్చేటప్పటికి తెరవెనుక బావమరది బాలయ్య జోక్యంతోనే సాధ్యమయ్యిందనే విషయం బయటకు పొక్కింది. దాంతో తెరవెనుక అసలేం జరిగిందనే విషయాలు మెల్లిగా బయటకు వస్తున్నాయ్. ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రకాశం జిల్లాలో కదిరి నియోజకవర్గం సిట్టింగ్ ఎంఎల్ఏ కదిరి బాబురావు. కదిరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడున్న విషయం అందరకీ తెలిసిందే.
పోయిన ఎన్నికల్లో గానీ అంతకుముందు ఎన్నికల్లో గానీ కేవలం బాలకృష్ణ వల్లే కదిరికి టికెట్ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో కదిరికి టికెట్ ఇవ్వటానికి చంద్రబాబు నిరాకరించారు. సర్వేల్లో కదిరిపై బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని, పోటీ చేయించినా ఓడిపోతారంటూ టికెట్ ఇవ్వటానికి నిరాకరించారు. దాంతో కదిరి వెళ్ళి బాలకృష్ణ నెత్తిన కూర్చున్నారు. కదిరికి టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంలో లేని చంద్రబాబు కాంగ్రెస్ సీనియర్ నేత ఉగ్రనరసింహారెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు.
ఇద్దరినీ సమీక్షకు పిలిపించి కదిరికి టికెట్ ఇచ్చేది లేదని చెప్పటంతో పాటు పోటీకి రెడీ అవమంటూ ఉగ్రకు చెప్పేశారు. దాంతో ఒళ్ళుమండిపోయిన కదిరి బాలకృష్ణతో మాట్లాడారు. వెంటనే బాలయ్య జోక్యం చేసుకున్నారు. నియోజకవర్గంలో పరిస్ధితిని బాలయ్యకు వివరించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే బాలయ్య చంద్రబాబు మాటను ఏమాత్రం పట్టించుకోలేదు. తన మిత్రుడికి టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుపట్టారు.
పనిలో పనిగా చిన్నల్లుడు శ్రీ భరత్ కు కూడా ఎంపిగా టికెట్ ఇవ్వాల్సిందేనంటూ హుకూం జారీ చేశారని అంటున్నారు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక చివరకు కదిరి బాబురావుకు కనిగిరిలో టికెట్ ఖాయం చేశారు. ముందు భరత్ కు ఎంపిగా టికెట్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు చివరలో మొండిచెయ్యి చూపించారు. కానీ బాలయ్య జోక్యంతో ఇపుడు భరత్ కు టికెట్ ఇవ్వక తప్పటం లేదట. ఏం చేస్తాం చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత.