వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబునాయుడు చేసిన ఒక పనితో నెల్లూరు జిల్లా నేతలు విజయంపై ఆశలు వదిలేసుకున్నారట. చంద్రబాబు చేసిన పని మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైందని నేతలు గొణుక్కుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని ఓ ఎంపి సీటుతో పాటు అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించే బాధ్యత మంత్రి పి. నారాయణ మీద పెట్టారట చంద్రబాబు. దాంతో నేతలందరికీ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లైంది. ఇప్పటికే మంత్రిపై నేతలందరూ బాగా గుర్రుమీదున్నారు. అటువటింది వచ్చే ఎన్నికల పెత్తనం కూడా నారాయణ మీదే మోపటంతో నేతలందరూ మండిపోతున్నారు.
జిల్లాలో ఒక ఎంపి సీటు, పది అసెంబ్లీ స్ధానాలున్నాయి. పోయిన ఎన్నికల్లో ఎంపి సీటుతో పాటు 7 అసెంబ్లీ స్ధానాలను వైసిపి గెలుచుకుంది. తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించి ఒక వైసిపి ఎంఎల్ఏని లాక్కున్నారు. తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎంఎల్సీ సీటులో టిడిపి గెలిచినా పట్టభద్రులు, టీచర్ల కోటాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన విషయం అందరూ చూసిందే. స్ధానిక సంస్ధల కోట ఎంఎల్సీని కూడా స్దానిక సంస్ధల ప్రజాప్రతినిధులను కొనేసి గెలుచుకున్నది టిడిపి. అంటే ఓట్లు కొనే ఎన్నికల్లో టిడిపి గెలిస్తే, జనాలు నేరుగా ఓట్లేసే ఎన్నికల్లో వైసిపి గెలిచింది.
పోయిన ఎన్నికల్లో, అంతుకుముందు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆర్ధికంగా ఆదుకున్నారన్న కారణంతో నారాయణను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతుకుముందు ప్రత్యక్ష రాజకీయాలతో కానీ జనాలతో కానీ ఏ సంబంధం లేని నారాయణ మంత్రి కాగానే నేతలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పటి వరకూ దశాబ్దాల పాటు రాజకీయాల్లో డక్కా మొక్కీలు తిన్న నేతలంతా నారాయణ ముందు మోకరిల్లాల్సొచ్చింది. దాంతో మంత్రికి, నేతలకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతీ నియోజకవర్గంలోను తనకంటూ ప్రత్యేకంగా అనుచరులను ఏర్పాటు చేసుకోవటంతో గొడవలు బాగా పెరిగిపోయాయి. ఇదే విషయాన్ని చంద్రబాబుకు నేతలెంత చెప్పినా పట్టించుకోలేదు. అదే సమయంలో నారాయణంటే ఏమాత్రం పడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చంద్రబాబు మంత్రిపదవి ఇవ్వగానే గ్రూపు రాజకీయాలు తగ్గకపోగా మరింత పెరిగిపోయాయి.
ఈ నేపధ్యంలోనే ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు ఉన్న నేదురుమల్లి, ఆనం లాంటి కుటుంబాలన్నీ వైసిపిలో చేరగా పార్టీ మరింత బలోపేతమైంది. పాదయాత్ర సందర్భంగా వేమిరెడ్డి, వేనాటి లాంటి ఆర్ధికంగా బలమున్న కుటుంబాలు కూడా వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నకలను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా పావులు కదపాల్సిన చంద్రబాబు ప్రజా జీవితంతో సంబంధం లేని, ఒంటెత్తు పోకడలు పోతున్న నారాయణ చేతిలో మొత్తం జిల్లాను పెట్టేసరికి నేతలంతా మండిపోతున్నారు. పోయినసారి వచ్చిన టిడిపికి వచ్చిన మూడ సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో వస్తాయన్న నమ్మకం లేదని టిడిపి నేతలే ఆఫ్ ది రికార్డుగా స్పష్టంగా చెబుతున్నారంటే టిడిపి పరిస్ధితేంటో అర్ధమైపోతోంది.