చివరి జాబితాలో చంద్రబాబు షాక్

ఫిరాయింపులతో పాటు కొందరు సిట్టంగ్ ఎంఎల్ఏలకు కూడా చంద్రబాబానాయుడు చివరి జాబితాలో షాక్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధుల చివరి జాబితాను మంగళవారం తెల్లవారుజామున ప్రకటించారు.  పెండింగ్ లో ఉన్న 35 అసెంబ్లీ, 25 లోక్ సభ సీట్లపై అనేక తర్జనబర్జనల తర్వాత మొత్తానికి ప్రకటించామని అనిపించుకున్నారు.

చివరి జాబితాలో కర్నూలు ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డికి పెద్ద హ్యాండే ఇచ్చారు. ఇక్కడ రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ కొడుకు టిజి భరత్ కు టికెట్ ఇచ్చారు. అలాగే అనంతపురం జిల్లాలోని కదిరిలో మరో ఫిరాయింపు ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాషకు కూడా టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ సీనియర్ నేత కందికుంట వెంకట శివప్రసాద్ కు టికెట్ ప్రకటించారు. కానీ ఈయనకు గతంలోనే కోర్టు 2 సంవత్సరాల శిక్ష వేసింది. బెయిల్ పై బయటున్నారు.

ఇక సిట్టింగ్ ఎంఎల్ఏల విషయానికి వస్తే సత్యవేడులో తలారి ఆదిత్యకు కూడా మొండి చెయ్యే చూపారు. ఈయన స్ధానంలో జేడి రాజశేఖర్ కు టికెట్ ప్రకటించారు. చివరి నిముషం వరకూ టికెట్ ఇవ్వకూడదని అనుకున్నా తంబళ్ళపల్లిలో సిట్టింగ్ ఎంఎల్ఏ శంకరయాదవ్ కే టికెట్ ఇవ్వక తప్పలేదు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సిట్టింగ్ ఎంఎల్ఏ బొల్లినేని రామారావుపై అనేక కేసులున్నాయి. మహారాష్ట్రలో ఏసిబి కేసులు కూడా నమోదయ్యాయి. అయినా ఆయనకే టికెట్ ఇచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది.

మొత్తంమీద జాబితాను చూస్తే ఇష్టంలేక పోయినా కొంతమందికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వక తప్పలేదని అర్ధమైపోతోంది.  చంద్రబాబును ఒత్తిడిలోకి నెట్టి మరీ టిజి వెంకటేష్ తన కొడుకు భరత్ కు టికెట్ సాధించుకున్నారు. అలాగే పలువురు ఎంపిలు శిద్దా రాఘవరావు, బీద మస్తాన్ రావు లాంటి అనేకమంది ఎంపి అభ్యర్ధులు ఇష్టం లేకపోయినా పోటీ చేయాల్సొస్తోంది. ఇష్టం లేకపోయినా టికెట్లివ్వటం, ఇష్టం లేకపోయినా బలవంతంగా పోటీ చేయాల్సి రావటంతో టిడిపి జాబితా గందరగోళంగా తయారైంది.