వియ్యంకుడు కమ్ బావమరిది నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. భరత్ తాత, టిడిపి దివంగత సీనియర్ నేత ఎంవివిఎస్ మూర్తి ఎంఎల్సీ పదవీ కాలాన్ని మరో నేతకు చంద్రబాబు కేటాయించారు. దాంతో ఎంఎల్సీ టికెట్ ఆశలు పెట్టుకున్న భరత్ కు పెద్ద షాక్ తగిలినట్లైంది. రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపిగా పోటీ చేయాలని ఉందని స్వయంగా భరతే మీడియాతో చెప్పారు. ఎలాగూ బాలకృష్ణ చిన్నల్లుడే కాబట్టి టికెట్ విషయంలో సమస్య ఉండదని అనుకున్నారు.
అయితే, ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో విశాఖపట్నం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా విశాఖపట్నం లోక్ సభ సీటును భరత్ కు కాకుండా కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు కేటాయించే విషయాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. గంటా కాకపోతే మరో బిసి నేతకు కేటాయించే విషయాన్ని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. కాబట్టి భరత్ కు టికెట్ దాదాపు లేనట్లే అని పార్టీ వర్గాలు చెప్పాయి.
అదే సమయంలో ఎంఎల్సీగా ఉన్న ఎంవివిఎస్ మూర్తి హఠాత్తుగా మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఆ పదవిని చంద్రబాబు ఎవరికీ కేటాయించలేదు. కాబట్టి మిగిలిన తాత పదవీ కాలాన్ని మనవడు భరత్ కు కేటాయిస్తే సరిపోతుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు లీకులు వదిలారు. అందరూ కూడా ఎంపి టికెట్ రాకపోయినా కనీసం ఎంఎల్సీ పదవైనా దక్కుతోందిలే అని అనుకున్నారు. తీరు చూస్తే ఇపుడు ఆ పదవీ కాలాన్ని చంద్రబాబు మరో నేతకు కట్టబెట్టారు. అంటే ఇటు ఎంపి టికెట్ దక్కే అవకాశం లేకపోగా వస్తుందనుకున్న ఎంఎల్సీ పదవి కూడా ఇంకోళ్ళకు కేటాయించేశారు. దాంతో మామా అల్లుళ్ళయిన బాలకృష్ణ, భరత్ లకు చంద్రబాబు ఒకేసారి షాక్ ఇచ్చారు.