ఐదుగురు ఎంఎల్ఏలకు చంద్రబాబు షాక్

అవును నిజమే. ఒకేసారి చంద్రబాబునాయుడు ఐదుగురు ఎంఎల్ఏలకు పెద్ద షాకే ఇచ్చారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జరిగిన జిల్లా పార్టీ నేతల సమీక్షలో అందరిముందు ఐదుగురు ఎంఎల్ఏలపై తవ్రస్ధాయిలో మండిపడ్డారు. దాంతో వారికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లైంది. జిల్లాలో ఇఫ్పటి వరకూ 23సార్లు పర్యటించారు. గతంలో జరిగిన పర్యటనలకు భిన్నంగా తాజా పర్యటన జరిగింది. రెండు రోజుల పాటు జిల్లాలో తిరిగిన చంద్రబాబు ఎక్కువగా పార్టీ నేతలతోనే కలిసున్నారు. రెండు రోజులు రాత్రిళ్ళు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు.

జిల్లా రెండు రోజలు పర్యటనలో శింగనమల, కల్యాణదుర్గం, పుట్టపర్తి, గుంతకల్, కదిరి నియోజకవర్గాలను చంద్రబాబు సమీక్ష చేశారు. పై నియోజకవర్గాలపై తాను చేయించుకున్న సర్వే నివేదికలను వాళ్ళ ముందుంచారట. వారి పని తీరుపై తనకు వచ్చిన ఫీడ్ బ్యాకును వాళ్ళకు చదివి వినిపించారట. చంద్రబాబు లెక్కల ప్రకారం ఈ ఐదు నియోజకవర్గాల్లో టిడిపి గెలవదనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందుకనే వాళ్ళపై మండిపడ్డారు. చంద్రబాబు ధోరణి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పై ఐదుగురు ఎంఎల్ఏలకు టిక్కెట్లు దక్కవని తేలిపోయిందనే చర్చ మొదలైంది.

శింగనమలలో తల్లీ, కూతుళ్ళైన ఎంఎల్సీ శమంతకమణి, యామినీబాల పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. వాళ్ళిద్దరూ కాకుండా కొడుకు అశోక్ తో కలిసి ముగ్గురు నియోజకవర్గాన్ని పంచేసుకున్నారట. ఇద్దరి పనితీరుపై జనాల్లో ఘోరమైన ఫీడ్ బ్యాక్ వచ్చిందని చెప్పారట. నేతలను కలుపుకుని వెళ్ళకపోవటం, కార్యకర్తలను పట్టించుకోవకపోవటం, అభివృద్ధిని గాలికొదిలేయటంతో తల్లీ, కూతళ్ళపై పార్టీలోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చేసిందిట.

ఇక కల్యాణదుర్గం ఎంఎల్ఏ హనుమంతరాయ చౌదరి పనితీరును కూడా చంద్రబాబు తప్పుపట్టారట. నియోజకవర్గంలోని ప్రతీ ఇష్యూలోను కొడుకు మారుతి జోక్యం పెరిగిపోవటంతో పార్టీ కంపు అయిపోయిందట. జిల్లాలో పార్టీ పరంగా గట్టి నియోజకవర్గమైన కుల్యాణదుర్గంను కంపు చేసేశారంటూ ఎంఎల్ఏపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. పుట్టపర్తి ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డి పనితీరుపైన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం  చూశారట. వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తిలో టిడిపి గెలవదని ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు చెప్పారని పార్టీ వర్గాలు చెప్పాయి.

అలాగే, గుంతకల్లు, కదిరి నియోజకవర్గాల ఎంఎల్ఏల పనితీరుపైన కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంతకల్లులో ఎంఎల్ఏ జితేందర్ గౌడ్ తో పాటు తమ్ముడి జోక్యం పెరిగిపోవటంతో నియోజకవర్గమంతా కంపైపోయిందట. ఎంఎల్ఏపైన అన్నీ వర్గాల్లోను వ్యతిరేకత పెరిగిపోయిందని చంద్రబాబు చెప్పటం గమనార్హం. ఇక, కదిరి ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాష్ వ్యవహారం కూడా డిటోనే. ఇక్కడ భాషకు పోటాగా కందికుంట వెంకట శివప్రసాద్ టిక్కెట్టు కోసం పోటీ పడుతున్నారు. దాంతో ఇద్దరి మధ్య ఆథిపత్య పోరాటం పెరిగిపోయి పార్టీ కంపుగా తయారైంది.

మొత్తం మీద చంద్రబాబు దగ్గరున్న ఫీడ్ బ్యాక్ చూస్తుంటే జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో టిడిపి గెలవదనే అభిప్రాయానికి నేతలొచ్చేశారు. అంటే జిల్లాలో పది సీట్లలో టిడిపి ఓడిపోతుందని అనంతపురం ఎంపి జేసీ దివాకర్ రెడ్డి చెప్పింది నిజమేనేమో. జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా చంద్రబాబు ఐదు నియోజకవర్గాలను మాత్రమే సమీక్షించటం ఏంటో అర్ధం కావటం లేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఈ ఐదుమంది ఎంఎల్ఏలకు టిక్కెట్టు ఇవ్వదలచుకోలేదట. అందుకనే ఇపుడు ఐదింటిని మాత్రమే సమీక్షించారట. మరి మిగిలిన ఐదు నియోజకవర్గాను ఎప్పుడు సమీక్షిస్తారో ఏమో ?