విశ్వసనీయతకు చంద్రబాబు మారుపేరట

చంద్రబాబునాయుడు మాటలు వినటానికి విచిత్రంగా ఉంటున్నాయి. తెలుగుదేశంపార్టీ దేశ రాజకీయాలకే దిక్సూచిగా మారిందని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏపి వరకూ ఏమి మాట్లాడినా చెల్లుబాటవుతుంది. కానీ ఏకంగా దేశానికే దిక్సూచిగా మారిందనటమే విడ్డూరంగా ఉంది. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తోందని చెప్పటం కూడా నవ్వు తెప్పిస్తోంది. పార్టీలో కీలక నేతలతో జరిగిన సమావేశంలో అనేక విషయాలు మాట్లాడారు.

 

ఆ సమయంలో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా కోసమే కాంగ్రెస్ తో కలిసినట్లు మళ్ళీ పాత రికార్డును తిరగేశారు. పోయిన ఎన్నికల్లో రాష్ట్రాభివృద్ధి కోసం, హోదా కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకున్నా అది చారిత్రాత్మకమని, అనివార్యతని, దేశావసరం కోసమే అని ఇలా..చాలా కథలే చెబుతారు. పార్టీ నేతల సమావేశంలో కూడా అదే చెప్పారు. జాతీయ పార్టీలు టిడిపితో కలిసి పనిచేయటానికి ఆశక్తి చూపుతున్నాయంటే కేవలం తనపై ఉన్న విశ్వసనీయత వల్లే అంటూ చెప్పుకున్నారు. ఎన్నికకో పార్టీతో పొత్తులు పెట్టుకుంటూ అవసరం తీరిపోగానే కాలితో తన్నేసే చంద్రబాబు కూడా విశ్వసనీయత గురించి మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది.

 

బిజెపియేతర జాతీయపార్టీలను కలపటానికి చంద్రబాబు చేసిన కృషి ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. నరేంద్రమోడికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం చంద్రబాబుకున్నట్లు మిగిలిన నేతలకు ఏమీ లేదు. పైగా మోడికి వ్యతిరేకంగా ఏ జాతీయస్ధాయి నేత కూడా చంద్రబాబుతో చేతులు కలపలేదు. చంద్రబాబే కర్నాటక వెళ్ళి కుమారస్వామిని కలిశారు. చెన్నై వెళ్ళి ప్రతిపక్ష నేత స్టాలిన్ తో మాట్లాడారు. ఢిల్లీకి వెళ్ళి శరదపవార్, ఫరూక్ అబ్దుల్లా తో సమావేశమయ్యారు. అందరి దగ్గరకు చంద్రబాబే వెళుతున్నారు కానీ ఎవ్వరూ చంద్రబాబు దగ్గరకు వచ్చి కలవలేదు. ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ చేతులు కలుపుతారో లేదో తెలీదు.

 

హోదా కోసమే కాంగ్రెస్ తో చేతులు కలిపినట్లు చెబుతున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మాత్రం చెప్పలేకపోతున్నారు. వాస్తవం ఇలాగుంటే జాతీయ రాజకీయాల్లో టిడిపి దిక్సూచిగా మారిందంటే ఎవరు నమ్ముతారు ? ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత చంద్రబాబుకు సమస్యలు ఎదురవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేది అనుమానమే. కేంద్రంలో మోడి, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వస్తే తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గ్రహించారు. అందుకే ముందుజాగ్రత్తగా జాతీయస్ధాయిలో తనకు మద్దతు కూడగట్టుకుంటున్నారని అనుమానంగా ఉంది.