వైసిపికి ఓట్లేసి జనాలు తప్పు చేశారా ?

ఓటమికి కారణాలను నిజాయితిగా సమీక్షించుకోవాల్సిన చంద్రబాబునాయుడు విచిత్రంగా మాట్లాడుతున్నారు. టిడిపిని ఓడించేందుకు జనాలు వైసిపికి ఓట్లేసి తప్పు చేశారట.  ఐదేళ్ళ అధికారంలో తాను ఏమి తప్పు చేయకపోయినా జనాలు తన పార్టీని ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్ధం కావటం లేదని చాలా అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు మాటలు విన్న కొత్త వాళ్ళకు నిజమే అనిపిస్తుంది. కానీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి చంద్రబాబు ఒకే పాటపాడుతున్నారు. తాను బ్రహ్మండమైన పాలన ఇచ్చినా జనాలు మాత్రం వైసిపికి ఓట్లేశారంటూ మండిపోతున్నారు. చంద్రబాబు మాటలు వింటుంటే వైసిపికి ఓట్లేసిన జనాలపై ఎంతగా మండిపోతున్నారో అర్ధమైపోతోంది.

జనాలపై తన ఆక్రోశాన్ని లోపల దాచుకోలేక సమీక్షల ముసుగులో విషాన్ని బయటకు కక్కుతున్నారు.  ఓటమి తర్వాత జరిగిన కొన్ని సమీక్షల్లో నేతలు ఓడిపోవటానికి కారణాలను చెప్పారు. అయినా వాటిని అంగీకరించటం లేదంటే చంద్రబాబు సమీక్షల్లో నిజాయితి అర్ధమైవటం లేదా ? చిత్తశుద్ది లేని సమీక్షలు, నిజాయితి లేని సమావేశాలు ఎన్నిపెట్టుకున్నా ఉపయోగం ఉండదని ముందు చంద్రబాబు గుర్తించాలి.

అఖండ మెజారిటితో గెలిచిన వైసిపికి ఎన్ని శాపనార్ధాలు పెట్టినా, ఓట్లేసిన జనాలపై ఎంతగా మండిపడినా ఏమీ లాభం లేదని చంద్రబాబుకు అర్ధం కావటం లేదేమో ? గెలుపోటములు సహజమని చెబుతున్న చంద్రబాబు ఇంకా ఘోర ఓటమిని తలుచుకుని ఎందుకు ఊగిపోతున్నారు ? కాబట్టి ఓటమిని పక్కనపెట్టి నిజాయితీతో సమీక్షలు జరుపుకుని మళ్ళీ గెలుపుకు కృషి చేస్తేనే పార్టీకి భవిష్యత్తు. లేకపోతే అంతే సంగతులు