పదేళ్ళుగా ఈవిఎంలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారట !

చంద్రబాబునాయుడు మాటలు విచిత్రంగానే ఉంటాయి. తాను చెప్పదలుచుకున్నదే చెబుతారు. అంతేకానీ అడిగినదానికి మాత్రం సమాధానం చెప్పరు. అలాగే చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన కూడా ఉండదు. తాజాగా ఢిల్లీలో ఎన్నికల కమీషన్ విధులు పార్శదర్శకతపై సదస్సు జరిగింది. ఆ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ పనితీరుపై మండిపడ్డారు.

అదే సమయంలో ఈవిఎంలపై తాను పదేళ్ళుగా పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.  ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ఆధారంగానే జరగాలని తాను చేస్తున్న పోరాటం గురించి గొప్పగా చెప్పుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈవిఎంలకు వ్యతిరేకంగా  పదేళ్ళుగా పోరాటం చేస్తున్నట్లు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఏపి జనాలకు తెలిసినంత వరకూ ఈవిఎంలకు వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడటం ఈమధ్యనే మొదలైంది.

అదికూడా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం టిడిపి లేదన్న విషయం అర్ధమైపోయిన తర్వాత నుండే ఈవిఎంలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పేపర్ బ్యాలెట్ అయితే తనిష్టం వచ్చినట్లు రిగ్గింగ్ చేసుకోవచ్చని చంద్రబాబు అనుకున్నారేమో ? ఎందుకంటే, ఈవిఎంలున్నపుడే చంద్రగిరిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఏ స్ధాయిలో రిగ్గింగ్ చేసుకున్నారో చూసి ఎన్నికల కమీషనే ఆశ్చర్యపోయింది.

2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఈవిఎంలను వ్యతిరేకంగా మాటమాత్రంగా కూడా వ్యతిరేకించలేదు. ఎన్నికలకు ముందుగానీ తర్వాత కానీ ఈవిఎంలపై ఎక్కడా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి.  అంటే వాతావరణం తెలుగుదేశంపార్టీకి అనుకూలంగా ఉన్నా, గెలుస్తుందన్న నమ్మకం ఉన్నా ఈవిఎంల గురించి చంద్రబాబు ఏనాడూ మాట్లాడలేదన్నది వాస్తవం. ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయని అనుమానం ఉన్నపుడు మాత్రమే ఈవిఎంల గురించి మాట్లాడుతుంటారు.