బాబ్బాబు మీటింగ్ రమ్మంటూ కాపు నేతలను చంద్రబాబునాయుడు బతిమలాడుకుంటున్నారు. విదేశాల నుండి రాగానే బుధవారం కాపు నేతలతో సమావేశం పెడితే ఒక్కరూ హాజరుకాలేదు. దాంతో చంద్రబాబుకు పెద్ద షాకే తగిలింది. పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకునే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు మీటింగ్ పెట్టినా ఎవరూ హాజరుకాలేదు. దాంతో మళ్ళీ శుక్రవారం మరోసారి సమావేశం పెట్టారు.
బుధవారం సమావేశం ఫెయిల్ అయిన నేపధ్యంలో శుక్రవారం మీటింగ్ కు అందరు కాపు నేతలు వచ్చేట్లుగా ముందుగానే వాళ్ళందరినీ బతిమలాడుకుంటున్నారు. చంద్రబాబు విదేశాల్లో ఉండగానే కాకినాడలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో కాపు నేతల సమావేశం జరిగిన విషయం బయటపడింది. అందులోను సమావేశంలో పాల్గొన్న నేతలంతా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారే కావటంతో సంచలనమైంది.
అప్పటికే తోట ఆధ్వర్యంలో కొందరు కాపు నేతలు టిడిపికి గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే రహస్య సమావేశం జరగటంతో పార్టీలో అసలేం జరుగుతోందో అర్ధంకాక అందరిలోను అయోమయం మొదలైంది.
విషయం చంద్రబాబు చెవినపడగానే విజయవాడకు తిరిగిరాగానే కాపు నేతలతో సమావేశం పెట్టారు. ఎవరూ హాజరుకాకపోయేసరికి మళ్ళీ మరో సమావేశం పెట్టారు. మరి ఈసారైనా కాపు నేతలు సమావేశానికి హాజరవుతారా ? అయినా ఎంతమంది హాజరవుతారు ? అనే విషయాలు బాగా ఆసక్తికరంగా మారాయి.