మోడి దేశభక్తిపై  చంద్రబాబు తీర్పు

అవును అందరిలోను ఇపుడివే అనుమానాలు మొదలయ్యాయి. నరేంద్ర మోడి విశాఖపట్నం బహిరంగసభను ఉద్దేశించి చంద్రబాబు నోటొకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పాక్ చెరలో నుండి వింగ్ కమాండర్ అభినందన్ భారత దేశం భూభాగంలోకి ప్రవేశించేటపుడు ఎదురెళ్ళి స్వాగతం పలకలేదు కాబట్టి మోడికి దేశభక్తి లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. పుల్వామా దాడిని ఖండించింది మొదట తానేనట. జవాన్ల కుటుంబాలకు రూ 5 లక్షలు ప్రకటించింది కూడా తామేనట. ‘మన ఉద్యోగులు రూ 30 అందించారని, దేశభక్తి, స్పూర్తికి అదే నిదర్శన’మంటున్నారు.

అభినందన్ కు స్వయంగా ప్రధాని స్వాగతం పలకకపోతే దేశభక్తి లేనట్లే అని చంద్రబాబు ఎలా తేల్చేశారో ఆయనే చెప్పాలి. అసలు అభినందన్ సురక్షితంగా మనదేశానికి ఎలా తిరిగి వచ్చారు ? అందుకు పాకిస్తాన్ మీద అన్నీ రకాలుగా ఒత్తిడి తెచ్చిందెవరు ? ప్రధానమంత్రి నరేంద్రమోడినా ? లేకపోతే చంద్రబాబా ? తన వల్లే అభినందన్ ను పాక్ ప్రభుత్వం వదిలేసిందని చెప్పినా చెబుతారు చంద్రబాబు. ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. బాంబులకే భయపడని తాను మోడికి భయపడతానా ? అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు బాంబులకు భయపడటమేంటో అర్ధం కావటం లేదు. చంద్రబాబుకేమీ ఫ్యాక్షన్ చరిత్రలేదే .

ఫ్యాక్షన్ చరిత్ర లేని నేతలు బాంబులకు ఎందుకు భయపడతారు ? అంటే ఉగ్రవాదులు బాంబులు పేల్చిన విషయాన్నేమైనా ప్రస్తావించారేమో తెలీటం లేదు.  కేసులకు, దాడులకు భయపడే ప్రశక్తే లేదన్నారు. ఓటుకునోటు కేసులో రాత్రికి రాత్రి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలి విజయవాడకు పారిపోయొచ్చిందెవరు ? పైగా మాటెత్తితే ఇందిర, రాజీవ్ తోనే పోరాటాలు చేశానని చెబుతుంటారు.

ఇందిరా గాంధి, రాజీవ్ గాంధిలు ప్రధానమంత్రులుగా ఉన్నపుడు చంద్రబాబు స్ధాయి ఏంటి ? ఇందిరా 1984లో హత్యకు గురయ్యారు. అప్పట్లో చంద్రబాబు ఎంఎల్ఏ కూడా కాదు. ఎంఎల్ఏ కూడా కాని వ్యక్తి ప్రధానితో ఏ విధంగా పోరాడారు ? రాజీవ్ ప్రధానమంత్రి హోదాలోనే 1991లో హత్యకు గురయ్యారు. అప్పటికి చంద్రబాబు స్ధాయి ఏంటి ? కేవలం ప్రతిపక్ష ఎంఎల్ఏ. ప్రతిపక్ష ఎంఎల్ఏకి ప్రధానితో పోరాటం చేయాల్సిన అవసరం ఏమోచ్చింది ?  ఏమిటో పాపం..చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.