కోట్లకు అప్పుడే టికెట్ లో కోత

కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంకా తెలుగుదేశంపార్టీలో చేరకుండానే చంద్రబాబునాయుడు ఓ టికెట్ కోతేశారు. దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధాన్ని వదులుకుని కోట్ల టిడిపిలో చేరతున్న విషయం తెలిసిందే. టిడిపిలో చేరాలంటే కర్నూలు ఎంపి సీటుతో పాటు డోన్ , ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు తమకు కేటాయించాలని డిమాండ్ పెట్టారు. అసలే గట్టి నేతల కొరతతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబు వెంటనే ఒప్పేసుకున్నారు.

అయితే ఇక్కడే సమస్య మొదలైంది. దశాబ్దాల పాటు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ సీటును వదులుకోవటానికి రెవిన్యుమంత్రి, ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుటుంబం అంగీకరించలేదు. పోయిన ఎన్నికల్లో డోన్ నుండి కెఇ సోదరుడు ప్రభాకర్ పోటీ చేసి ఓడిపోయారు. రేపటి ఎన్నికలకు మళ్ళీ ప్రబాకర్ రెడీ అవుతున్నారు. ఇటువంటి  నేపధ్యంలో కోట్ల కాంగ్రెస్ లో చేరాలనుకోవటం, డోన్ సీటును అడగటంతో సమస్య మొదలైంది. ఎందుకంటే, దశాబ్దాలుగా కోట్ల, కెఇ కుటుంబాల మధ్య వైరం ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

కోట్ల టిడిపిలోకి వస్తే తమ ఉనికికి ఇబ్బంది తప్పదని నిర్ణయించుకున్న కెఇ కుటుంబం డోన్ టికెట్ ను వదులు  కోవటానికి ససేమిరా అన్నారు. దాంతో చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైంది. పైగా డోన్ నియోజకవర్గానికి బదులు కోట్ల కుటుంబానికి కర్నూలు అసెంబ్లీ టికెట్ కేటాయించమని సూచించారు కెఇ. సరే ఆ విషయంలో ఏం చేయాలో దిక్కుతోచక చంద్రబాబేదో కసరత్తు చేస్తున్నారనుకోండి అదివేరే సంగతి.

డోన్ సీటులో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో తెలీదు కానీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాత్రం తాను టిడిపిలో చేరుతానని ఎక్కడా చెప్పలేదని పెద్ద బాంబు పేల్చారు. దాంతో చంద్రబాబు వెంటనే కోట్లతో మాట్లాడినట్లు సమాచారం. సరే ఏం చెప్పి కోట్లను చంద్రబాబు ఒప్పించారో తెలీదు. అయితే, కేంద్ర మాజీమంత్రి కొడుకు కోట్ల రాఘవేంద్రరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి, తల్లి మాత్రమే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేయటం లేదని కూడా ప్రకటించారు.  అంటే కోట్ల అడిగిన మూడు టికెట్లలో చంద్రబాబు అపుడే ఒకటి కోతేసినట్లు అర్దమవుతోంది. మరి కోతేసిన టికెట్ ఆలూరా లేకపోతే డోనా అన్నదే తేలాలి.