రాధాకు చంద్రబాబు షాక్

వంగవీటి రాధాకృష్ణకు చంద్రబాబునాయుడు తన మార్క్ రాజకీయాన్ని రుచి చూపించారు. ఇంకా టిడిపిలోకి చేర్చుకోకుండానే రాధాకు తానేంటో చంద్రబాబు చూపించగలిగారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ బోండా ఉమా కే టికెట్ కేటాయించటంతో రాధాకు షాక్ తప్పలేదు. వైసిపిలో ఉన్నంత వరకూ పార్టీలో నుండి బయటకు లాగటానికి టిడిపి నేతలతో రాధాను చంద్రబాబు బాగా గోకించారు. దాంతో ముందు వెనుక చూసుకోకుండానే రాధా ఆవేశంతో వైసిపికి రాజీనామా చేసేశారు. అంతేకాకుండా  జగన్ పై నిరాధారమైన ఆరోపణలు కూడా చేశారు. చంద్రబాబు మార్క్ రాజకీయం అర్ధమైన తర్వాత ఇపుడు రాధా తీరిగ్గా విచారిస్తుండవచ్చు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ విషయంలో జగన్ కు రాధాకు విబేధాలొచ్చాయి. సెంట్రల్ లో టికెట్ కేటాయించటం సాధ్యం కాదుకాబట్టి విజయవాడ తూర్పు నియోజకవర్గం కానీ లేదా మచిలీపట్నం ఎంపి గా గానీ పోటీ చేయమని జగన్ ఆఫర్ ఇచ్చారు. నిజానికి రాధాకు జగన్ ఆఫర్ ఇవ్వటమే చాలా గొప్ప. ఎందుకంటే, తండ్రి వంగవీటి రంగా పేరు చెప్పుకునే రాధా బతికిపోతున్నారు. అంతేకానీ రాజకీయంగా తనకంటు సొంత అస్తత్వమే లేదు రాధాకు. గట్టిగా చెప్పాలంటే ఇంతకాలం లేస్తే మనిషినికాను అన్నట్లుగా రాజకీయాలు చేశారు.

సరే నియోజకవర్గంలో విబేధాలు మొదలవ్వటంతో వెంటనే టిడిపి నేతలు రంగంలోకి దిగేశారు. జగన్ కు వ్యతిరేకంగా రాధాను గోకటం మొదలుపెట్టారు. వైసిపికి రాజీనామా చేసి టిడిపిలోకి వచ్చేస్తే కోరిన సీటు ఇస్తానన్నట్లుగా చంద్రబాబు ఫీలర్లు వదిలారు. చంద్రబాబు మాటను నమ్మి వైసిపికి రాజీనామా చేసేశారు. తీరా చూస్తే రాధా కోరిన సెంట్రల్ నియోజకవర్గం ఇవ్వటానికి సాధ్యం కాదన్నారు. ఇపుడేమో సిట్టింగ్ ఎంఎల్ఏకే టికెట్ కేటాయించేశారు చంద్రబాబు.

రాధా ఇంకా టిడిపిలో చేరనేలేదు. ఎంఎల్ఏగా అవకాశం లేదు కాబట్టి ఎంఎల్సీగా అవకాశం ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారట. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక టిడిపిలో చేరికను రాధా వాయిదా వేస్తున్నారు. నిజానికి రాధాను టిడిపిలోకి చేర్చుకోవాలని చంద్రబాబుకు కూడా ఏమీ లేదు. వైసిపిలో నుండి రాధాను బయటకు లాగటమే చంద్రబాబు టార్గెట్. ఎప్పుడైతే రాధా వైసిపి నుండి వచ్చేశారో అప్పటి నుండి రాధాను చంద్రబాబు పట్టించుకోవటం మానేశారు. దాంతో రాధా ఇపుడు ఎటూ కాకుండా పోయారు.