చంద్రబాబునాయుడు, ఐఏఎస్ ల మధ్య వ్యవహరం బాగా ముదిరిపోయి తుపాను హెచ్చరికల్లా మారుతోంది. చంద్రబాబు పంతం కొద్ది 10వ తేదీ క్యాబినెట్ సమావేశం పెట్టాలని నిర్ణయించుకోవటంపై ఐఏఎస్ అధికార్లు మండిపోతున్నారు. నిజంగానే పరిస్ధితి అంతదాకా వస్తే చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకోవాలని కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు.
చంద్రబాబు వైఖరిపై ఐఏఎస్ లు మొన్ననే అత్యవసర సమావేశం కూడా పెట్టారు. ఎలక్షన్ కమీషన్ మీద కోపాన్ని ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపైనే కాకుండా ఎలక్షన్ కమీషనర్ గోపాల కృష్ణ ద్వివేదిపైన చూపటాన్ని ఖండించారు. మామూలుగా అయితే బ్యూరోక్రసీతో గొడవ పెట్టుకునే రకం కాదు చంద్రబాబు. కానీ ఇపుడు గొడవల పెట్టుకుంటున్నారంటే ఓటమి భయానికి తోడు వయసుతో వచ్చిన సమస్యలే ప్రధాన కారణంగా అనుకుంటున్నారు.
క్యాబినెట్ సమావేశం నిర్వహించాలంటూ సిఎస్ కు చంద్రబాబు ఓ నోట్ పంపారు. ఆ నోట్ ను సిఎస్ జిఏడి పొలిటికల్ సెక్రటరికి పంపారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నపుడు క్యాబినెట్ సమావేశం పెట్టకూడదు. అయినా సమావేశం పెట్టాలంటూ చంద్రబాబు పట్టుబడుతున్నారు. చంద్రబాబు పట్టుదల ఎలాగున్నా అందుకు ఎలక్షన్ కమీషన్ అనుమతి అవసరం.
పైగా చంద్రబాబు పంపిన నోట్ లో క్యాబినెట్ సమావేశం నిర్వహించాల్సిన అవసరాన్ని చెప్పలేదు. నోట్ లో ఏ ఏ అజెండాలను కూడా చేర్చలేదు. కాబట్టి చంద్రబాబు పంపిన నోట్ ను సిఎస్ ఎలక్షన్ కమీషన్ కు పంపుతారు. కమీషన్ ఎలాగూ అడ్డుకుంటుంది. సరే ఇది అందరూ ఊహిస్తున్న విషయమే. ఈసి అడ్డుకున్న తర్వాతే ఏం జరుగుతుందన్నదే ఉత్కంఠగా మారింది. ఏదేమైనా చంద్రబాబును ధీటుగా ఢీ కొనటానికి ఐఏఎస్ లు కూడా రెడీ అవుతున్నారు. మరి ఏం జరుగుతుందో ఏమో ?