అనుకున్నంతా అయింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఫిరాయింపుల్లో 17 మందికి చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో టికెట్లివ్వటం సాధ్యం కాదంటూ తేల్చి చెప్పేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. నలుగురు మంత్రుల్లో కూడా ఇద్దిరికే మళ్ళీ టికెట్లివ్వదలచుకున్న చంద్రబాబు మిగిలిన ఇద్దరికీ సాధ్యం కాదని చెప్పేసారట. దాంతో ఫిరాయింపు రాజకీయ భవిష్యత్తు ఎటూ కాకుండా అయిపోయింది.
పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు టిడిపిలోకి ఫిరాయించారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న ఏకైక లక్ష్యంతో ప్రలోభాలకు గురిచేసి వాళ్ళని పార్టీలోకి లాక్కున్నారు. తాత్కాలిక ప్రయోజనాలకు పాకులాడిన కారణంగా ఇపుడు వాళ్ళ భవిష్యత్తు మూసుకుపోయింది. మొత్తం ఫిరాయింపుల్లో ఎంఎల్ఏలు, ఎంపిలకు కలిపి కేవలం ఏడుగురికి సీట్లొస్తే చాలా ఎక్కువ అని పార్టీ నేతలంటున్నారు. ఎంపిల్లో ముగ్గురికీ చంద్రబాబు మొండిచెయ్యే చూపించారు.
ఐదుగురు మంత్రులు అమరనాధరెడ్డి, భూమా అఖిలప్రియ, కిడారి శ్రవణ్ కుమార్, సుజయ కృష్ణ రంగారావు, ఆదినారాయణరెడ్డిల్లో ముగ్గురికే ఛాన్స్ ఇస్తున్నారు. అఖిల, అమరనాధ్, శ్రవణ్ కుమాత్రమే టికెట్లు ఇస్తున్నారు. సుజయ కృష్ణ రంగారావు, ఆది నారాయణరెడ్డిలకు చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు. ఆదిని కడప ఎంపిగా పంపుతున్నారు. సుజయ సంగతే తేలలేదు. అలాగే, ఎంఎల్ఏల్లో కూడా ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు ఫిరాయింపు ఎంఎల్ఏ అశోక్ రెడ్డి, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జ్యోగుల నెహ్రు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ కు బదులు కూతురు షభానా ఖాతూన్ కు మాత్రమే టికెట్లివ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.
పార్టీ నేతల సమాచారం ప్రకారం మిగిలిన ఫిరాయింపు ఎంఎల్ఏలు పాతపట్నం ఎంఎల్ఏ కలమట వెంకటరమణ, పాడేరు నుండి గిడ్డి ఈశ్వరి, రంపచోడవరంలో వంతల రాజేశ్వరి, ప్రత్తిపాడు నుండి వరుపులు సుబ్బారావు, యర్రగొండపాలెంలో డేవిడ్ రాజు, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కోడుమూరు నుండి మణిగాంధీ, కదిరి చాంద్ భాష, పామర్రులో ఉప్పులేటి కల్పన, బద్వేలులో జయరామ్ కు సీట్లు లేదని చెప్పేశారట. కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి విషయాన్ని ఇంకా తేల్చలేదు. గూడూరులో పాశం సునీల్ విషయం కూడా తేల్చలేదు. మొత్తానికి ఫిరాయింపులపై చంద్రబాబు ఒకేసారి పెద్ద దెబ్బే వేశారు.