కొందరు అభ్యర్ధుల వల్లే ఇబ్బందులు

మొన్నటి ఎన్నికల్లో కొందరు అభ్యర్ధుల వ్యవహారశైలి వల్లే ఇబ్బందులు తలెత్తినట్లు  చంద్రబాబునాయుడు  మండిపడ్డారు. అభ్యర్ధులతో జరిగిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ,  గెలుపు తమదే అన్న భావనతో కొందరు అభ్యర్ధులు ఉదాశీనంగా వ్యవహరించినట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్ధులతో జరిపిన సమీక్షలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

పోలింగ్ జరిగన వెంటనే చంద్రబాబు మాటల్లో టిడిపి గెలుపు రెండోసారి కష్టమే అన్న అర్ధమే ధ్వనించంది. కానీ నాలుగు రోజులు ఈవిఎంలపైన ఎన్నికల కమీషన్ పైన మాటల యుద్ధం చేశారు. తర్వాత నుండి టిడిపికి 130 సీట్లు ఖాయమే అంటు కొత్త రాగం మొదలుపెట్టారు. పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలే టిడిపిని గెలిపిస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

మహిళలందరూ పెద్ద ఎత్తున టిడిపికి అనుకూలంగా ఓట్లేసినట్లు చెబుతున్నారు. అందుకు శాస్త్రీయంగా ఆధారాలు లేనప్పటికీ పసుపు కుంకుమలో అందుకున్న డబ్బులే కారణమని చంద్రబాబు అనుకుంటున్నారు. అయితే, సమీక్షలో ఆ విషయంలో కొంత వరకే నిజముందని అభ్యర్ధులు కుండబద్దలు కొడుతున్నారు. ఎలాగంటే పసుపు కుంకుమ పథకం ద్వారా  డ్వాక్రా మహిళల్లో చాలామందికి డబ్బులు అందింది వాస్తవమే.

అయితే డబ్బులందుకున్న డ్వాక్రా మహిళలందరూ టిడిపి మద్దతుదారులే కాదు. డ్వాక్రా గ్రూపుల్లో టిడిపి మద్దతుదారులతో పాటు వైసిపి, జనసేన, వామపక్షాల మద్దతుదారులు కూడా ఉన్నట్లు అభ్యర్ధులే చెబుతున్నారు. ప్రభుత్వం నుండి డబ్బులు తీసుకున్నారే కానీ ఎవరి పార్టకి వాళ్ళు ఓట్లేసుకున్నది వాస్తవం. అందుకే పసుపు కుంకుమలో డబ్బులు తీసుకున్న ఆడోళ్ళంతా టిడిపి ఓట్లేయలేదని టిడిపి అభ్యర్ధులు చెప్పారు. కాబట్టి పసుపు కుంకుమలో ఆడోళ్ళంతా టిడిపికే ఓట్లేశారన్న విషయం తప్పని తేలిపోయింది.